4వేల ఆర్థిక సాయంతో రైతులకు భరోసా
పెట్టుబడి సాయంతో మారుతున్న రైతుల స్థితి
నిజామాబాద్,జూలై26(జనంసాక్షి): ఎకరాకు 4వేల ఆర్థిక సాయం వల్ల జిల్లాలో అనేకమంది రైతులకు ప్రత్యక్షంగా ఆర్థిక సాయం అందింది. ఇటీవల అందచేసిన సాయం వల్ల్ వేలాది మంది రైతులు పెట్టుబడులకు భరోసా దక్కింది. వచ్చే ఏడాది నుంచి ఎకరానికి రూ.8 వేల పెట్టుబడి అందిస్తామని, గిట్టుబాటు ధరల కోసం రైతు సంఘాలను ఏర్పాటు చేస్తున్నామని సిఎం ప్రకటించారు. వీటన్నింటి ఫలితంగా రాష్ట్రంలో రైతుల బతుకు బాగుపడుతుందని నమ్ముతున్నానని అన్నారు. ఇవన్నీ అమలై ఓ ఐదేళ్లు గడిచాక రైతు జీవితాల్లో ఎంతో మార్పు వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాంకులు రైతుల ఇళ్ల ముందు నిలబడి అప్పులిచ్చే పరిస్థితి వస్తుందని అంటున్నారు. అప్పుల పాలై ఆర్థికంగా చితికిపోతున్న దశలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపడుతోంది. ప్రస్తుతం వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి వాటిని పరిష్కరించుకునే దిశగా ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇకపోతే పంటల ధరల విషయంలో రైతు సంఘాలు కీలకం కానున్నాయి. ఏదైనా పంటకు మార్కెట్లో ధర రాని పక్షంలో రాష్ట్ర రైతు సంఘం జోక్యం చేసుకొని నేరుగా పంటను కొనుగోలు చేస్తుంది. ఇందుకు ప్రభుత్వం సంఘానికి రూ.500 కోట్లు మూల నిధిని సమకూరుస్తుంది. వీటిపై గ్రామ రైతు సంఘాల సమక్షంలో విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకుంటారు. ఉమ్మడి జిల్లా మొత్తంలో రెవెన్యూ రికార్డుల ప్రకారం కొంతభూమి లెక్కలోకి వచ్చింది. లెక్కల్లోకి రానకుండా మిగిలిన భూమి ఎవరిదనేది తేల్చాలి. వాటిని రైతులు సాగు చేసుకుంటున్నా.. వారి పేరున లేకపోవడంతో సమగ్ర సర్వేలో వారి పేర్లు నమోదు చేసుకోవడం లేదు. వీటన్నింటి సరి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సరిచేసిన భూవివరాల ఆధారంగానే రూ.8 వేల పెట్టుబడి ఇచ్చే పథకం అమలు చేస్తారు. ఆ మేరకు రైతుల వివరాలు పొందుపరుస్తున్నామని వ్యవసాయాధికారులు తెలిపారు.