40 మంది 400 మందిని అడ్డుకుంటారా?

5

– దేశ ప్రతిష్ట మంటగలుస్తోంది

– స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 11(జనంసాక్షి):

కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు దేశప్రతిష్టను మంటగలుపుతున్నారని లోక్‌ సభ స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ 40 మంది కలసి మొత్తం 400మందికి పైగా సభ్యుల కాలాన్ని హరణం చేస్తున్నారని అన్నారు. వీరి కారణంగా మొత్తం దేశం పరువు పోతోందని అన్నారు. టీవీల్లో కనిపించాలనుకుంటే తమకు అభ్యంతరం లేదని, అయితే ప్రజలు గమనిస్తున్నారని గుర్తుంచుకోవాలన్నారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్న కాంగ్రెస్‌ పక్ష సభ్యులను ఉద్దేశించి ఆమె సీరియస్‌ అయ్యారు. ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని ఆమె అన్నారు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి నిర్వహిస్తున్న పార్లమెంటులో చర్చలు జరగకుండా అడ్డుపడుతున్న తీరును దేశ ప్రజలందరు చూడాలని ఆమె అన్నారు. ప్లకార్డులు చట్టసభలలోకి తీసుకు రారాదని చెప్పినా వినకుండా తెస్తున్నారని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవలికాలంలో సుమిత్ర మహాజన్‌ ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేయలేదని చెప్పాలి. పార్లమెంట్‌ సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. విపక్షాలు పలు అంశాలపై చర్చకు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. లోక్‌సభలో వాటిని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తోసిపుచ్చారు. ముందుగా ప్రశ్నోత్తర సమయం జరగాలని తర్వాత చర్చకు అనుమతి ఇస్తామని ఆమె తెలిపారు. దీంతో విపక్షాల సభ్యులు పొడియం చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. ఏదైనా చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సభాపతి సభ్యులకు సూచించారు. 50 మంది సభ్యులు 450 మంది సభ్యుల హక్కులను హరిస్తున్నారని ఆమె అన్నారు. లోక్‌సభలో ఆందోళన చేస్తూ సభా కార్యకలాపాలకు పదేపదే అడ్డు తగులుతున్న కాంగ్రెస్‌ సభ్యులపై స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభాపతి సీట్లో ఉన్నప్పుడు కాగితాలు విసిరివేయడం ఏంటని ప్రశ్నించారు. సభా మర్యాదలు ఉల్లంఘిస్తూ స్పీకర్‌పై కాగితాలు వేస్తున్నారని.. ఇలాంటి వ్యవహరాలు, చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ బుధవారానికి  వాయిదా పడింది. లలిత్‌మోదీ వ్యవహారంలో సుష్మాస్వరాజ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ సభ్యులు సభలో ఆందోళన చేపట్టడంతో స్పీకర్‌ సభను సాయంత్రం 4 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ విపక్ష సభ్యులు తమ ఆందోళన కొనసాగించారు. దీంతో సభను  వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించారు. మరోవైపు రాజ్యసభలో కూడా ఇదే అంశంపై రగడ నెలకొంది. ఇక నిరసనలు చాలు… చర్చలు జరపాలంటూ డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ సభ్యులకు హితవు పలికారు.