46 వేల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
ముంబయి,డిసెంబర్ 1,(జనంసాక్షి): దాదాపు 46,100 మంది భారతీయులకు అమెరికా శాశ్వత పౌరసత్వం లభించినట్లు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ¬మ్‌లాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) వెల్లడించింది. దీనికి సంబంధించిన నివేదికను డీహెచ్ఎస్ విడుదల చేసింది. అక్టోబర్ 1, 2015 నుంచి సెప్టెంబర్ 30, 2016 వరకు అమెరికా ప్రభుత్వం మొత్తం 7.53లక్షల మంది వ్యక్తులకు యూఎస్ పౌరసత్వాన్ని కల్పించింది. వారిలో ఆరు శాతం భారతీయులు ఉన్నారు. అత్యధిక సంఖ్యలో యూఎస్ పౌరసత్వాన్ని అందుకున్న వారిలో మెక్సికన్లు అగ్రస్థానంలో నిలిచారు. మెక్సికో నుంచి వచ్చిన వారికి పౌరసత్వం ఇచ్చే సంఖ్య ఏటా తగ్గుతోంది. 2015తో పోల్చుకుంటే గతేడాదిలో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 24శాతం పెరిగినట్లు డీహెచ్ఎస్ వెల్లడించింది. 2015లో శాశ్వత పౌరసత్వం కోసం 7.83లక్షల దరఖాస్తులు రాగా.. 2016లో 9.72లక్షల దరఖాస్తులు వచ్చాయి. సాధారణంగా గ్రీన్ కార్డు ఉన్న వారికి మాత్రమే యూఎస్ పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది. దీనికింద యూఎస్‌లో సుదీర్ఘకాలం పాటు నివసించవచ్చు.
పౌరసత్వం లభించిన వారికి కొన్ని హక్కులు వస్తాయి. అక్కడి ఎన్నికల్లో ఓటు వేసే హక్కు, ఉద్యోగ అవకాశాల్లో వీరికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని ఏసియన్ అమెరికన్ అడ్వాన్సింగ్ జస్టిస్ అధ్యక్షుడు జాన్ సి యాంగ్ అభిప్రాయపడ్డారు. న్యూ అమెరికన్ జాతీయ విభాగం నివేదిక ప్రకారం గత రెండేళ్లలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు 77శాతం పెరిగాయి. 2017 జూన్ చివరి నాటికి 7.08లక్షల దరఖాస్తులు పౌరసత్వం కోసం వేచి ఉన్నాయి