మౌలాలీలో ఘోరం


గోడకూలి ఆరుగురి మృతి
మృతులంతా పాలమూరు వలస బిడ్డలే
హైదరాబాద్‌, జూలై 23 (జనంసాక్షి) :
మౌలాలీలోని ఎంజేె కాలనీలో ఘోర ప్రమాదం జరిగింది. గోడ కూలి రెండు కుటుంబాల సమాధి అయిపోయాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా కోవెలకొండ మండలం కోతులాపురం గ్రామం నుంచి మహదేవన్‌ కుటుంబం, రంగారెడ్డి జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన వెంకటయ్య కుటుంబం చాన్నాళ్ల క్రితం కూలీ పనులు చేసేందుకు నగరంలోని మౌలాలీకి వచ్చారు. ఎంజే కాలనీలో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంటుకు అనుకుని ఉన్న పాతగోడను ఆసరా చేసుకుని గుడిసెలు వేసుకున్నారు. సోమవారం రాత్రి 10.50 గంటల ప్రాంతంలో ఈ పాతగోడ వర్షాలకు తడిచి ఉండడంతో ఒక్కసారిగా కూలి శిథిలాలు ఆ గుడిసెలపై పడ్డాయి. ఆ గుడిసెల్లో గాఢనిద్రలో ఉన్న వెంకటయ్య, మహదేవన్‌ కుటుంబాలు చిక్కుకున్నాయి. వెంకటయ్య-పద్మ దంపతులకు ఇద్దరు పిల్లలు. అలాగే మహదేవన్‌-పద్మ దంపతులకు కూడా ఇద్దరు పిల్లలు.. మొత్తం ఎనిమిది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. మరో కుటుంబంలోని భార్యాభర్తలు మృత్యువాత పడ్డారు. ఇద్దరు పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. స్వల్పగాయాలతో బాధపడుతున్న వారు ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఉదయానికి ఆరుగురి మృతదేహాలను రెస్య్కూ టీమ్‌ వెలికి తీసింది. మృతదేహాలను గాంధీ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదానికి అధికారులు నిర్లక్షమే కారణమని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ ఆరోపించారు. మంగళవారం ఉదయం ఆయన ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగురు మరణించడం దురదృష్టకరమన్నారు. ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారన్నారు. పురాతన భవనాలు, కట్టడాలు కూల్చివేయాలని గతంలోనే నిర్ణయించినా దాన్ని అమలు చేయకపోవడం వల్లే ఈఘటనకు కారణమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పురాతన గోడ పక్కనే పెద్ద ఎత్తున భవన నిర్మాణం చేపట్టినా అధికారులు ఆ గోడను కూల్చాలన్న నిబంధన ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనాధలుగా మిగిలిన చిన్నారులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఘటన విషయం తెలియగానే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా బాధితులకు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.  ఇదిలా ఉండగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు వెంటనే చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. పురాతన గోడను కూల్చకుండా పక్కనే అపార్టుమెంట్‌ నిర్మిస్తున్న యజమానిపై కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. చిన్నారులను   ఆదుకుంటామని ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ తరఫున మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల వంతున ఎక్స్‌గ్రేషియో అందిస్తామని ప్రకటించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. ప్రమాద స్థలాన్ని సందర్శించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ గోడ నిర్మిస్తున్న బిల్డర్‌, యజమానిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. వీరిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేశామన్నారు. బిల్డర్‌ యజమానులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్టు సమగ్ర విచారణ జరిపిన అనంతరం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు 8 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని మంత్రి తెలిపారు. గాయపడ్డ ఇద్దరు చిన్నారులపై 6 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయనున్నట్టు మంత్రి తెలిపారు. భవిష్యత్తులో వీరికి ఉచిత విద్యతో పాటు అన్ని వసతులు కల్పిస్తామన్నారు. 30 సంవత్సరాలు దాటిన భవనాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు సరైన నివేదిక నివేదించాలని మంత్రి కోరారు.