కారు ఢీ: ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు

సంగం: అతివేగంతో వస్తున్న కారు ఢీ కొని ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడిన సంఘటన నెల్లూరు జిల్లా సంగం మండలం తరుణవాయి గ్రామంలో జరిగింది. తరుణవాయి గ్రామానికి చెందిన విద్యార్థులు బుచ్చిరెడ్డిపాలెంలోని కళాశాలకు వెళ్లేందుకు బస్సుకోసం ముంబయి రహదారి వద్ద వేచి ఉన్నారు. ఈ సమయంలో నెల్లూరు నుంచి సంగం వైపు వస్తున్న కారు అతివేగంతో రహదారికి అవతలివైపు ఉన్న విద్యార్థులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బి. నరసింహం, బి. వెంకయ్య, ప్రసన్నకుమార్‌లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నెల్లూరు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న మరో 20 మంది విద్యార్థులు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.