విండీస్ టీ ట్వంటీ జట్టు నుండి రామ్‌దిన్ ఔట్
జమైకా
జూలై 25 : వెస్టిండీస్ వికెట్ కీపర్ దినేష్ రామ్‌దిన్‌ను సెలక్టర్లు మరోసారి పక్కన పెట్టారు. ఫామ్ కోల్పోయిన రామ్‌దిన్‌ను టీ ట్వంటీ జట్టు నుండి కూడా తప్పించారు. దీంతో పాకిస్థాన్‌తో జరగనున్న రెండు టీ ట్వంటీల సిరీస్‌లో కూడా జాన్సన్ ఛార్లెస్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. తాజాగా ముగిసిన వన్డే సిరీస్‌లోనూ రామ్‌దిన్ చోటు కోల్పోయాడు. అటు క్రిస్‌గేల్ , మార్లోన్ శామ్యూల్స్ మూడు నెలల తర్వాత షార్ట్ ఫార్మేట్‌లోకి తిరిగి వచ్చారు. మార్చిలో జింబాబ్వేపై గాయాల కారణంగా వీరిద్దరూ ఆడలేకపోయారు. అటు వరుసగా విఫలమవుతోన్న కిరణ్ పొల్లార్డ్ మాత్రం టీ ట్వంటీ జట్టులో తన చోటు నిలుపుకున్నాడు. 2013 వన్డే కెరీర్‌లో పొల్లార్డ్ ఆరుసార్లు డకౌటయ్యాడు. ఇదిలా ఉంటే ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్‌కు మాత్రం టీ ట్వంటీలకు చోటు దక్కలేదు. ఇప్పటికే సొంతగడ్డపై వన్డే సిరీస్ కోల్పోయిన విండీస్ షార్ట్ ఫార్మేట్‌లోనైనా సత్తా చాటాలని భావిస్తోంది. పాకిస్థాన్,వెస్టిండీస్ రెండు టీ ట్వంటీ మ్యాచ్‌లు జూలై 27,28 తేదీలలో సెయింట్ విన్సెంట్ వేదికగా జరగనున్నాయి. అనంతరం జూలై 30 నుండి ప్రారంభమయ్యే కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో విండీస్ ఆటగాళ్ళు ఆడనున్నారు.
వెస్టిండీస్ టీ ట్వంటీ జట్టు ః
డారెన్ సామి (కెప్టెన్) , శామ్యూల్ బద్రీ , క్రిస్టోఫర్ బార్న్‌వెల్ , టినో బెస్ట్ , డారెన్ బ్రేవో , డ్వయాన్ బ్రేవో , జాన్సన్ ఛార్లెస్ , శానోన్ గాబ్రియల్ , క్రిస్ గేల్ , కిరణ్ పొల్లార్డ్ , సునీల్ నరైన్ , మార్లోన్ శామ్యూల్స్ , లిండ్లే సిమ్మన్స్