ఘనంగా విజయ్‌ దివస్‌


కార్గిల్‌ అమరులకు నివాళి
దేశ రక్షణలో జవాన్లే కీలకం : ఆంటోని
న్యూఢిల్లీ, జూలై 26 (జనంసాక్షి) :
దేశ రక్షణలో జవాన్లే కీలకమని భారత రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోని అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని ఇండియాగేట్‌ వద్ద విజయ్‌ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంటోని కార్గిల్‌ యు ద్ధంలో మరణించిన వీర జవా న్లకు నివాళులర్పించారు. అమ ర్‌ జవాన్‌ జ్యోతి వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంటోనీ మాట్లాడుతూ, దేశాన్ని ఎళ్లవేళలా సైన్యం కంటికి రెప్పలా కాపాడుతోందని అన్నారు. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పొరుగు దేశాల సైన్యానికి దీటైన జవాబునిస్తున్నారని కొనియాడారు. దేశ అంతర్గత భద్రత వ్యవహారాల్లోనూ సైన్యం కీలకభూమిక పోషిస్తుందని అన్నారు. ఇటీవల సంభవించిన ఉత్తరాఖండ్‌ విపత్తు సమయంలో త్రివిద దళాలు చూపిన తెగువ అభినందనీయమన్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని ప్రజలను రక్షించడానికి అహరహం శ్రమిస్తున్నారని కొనియాడారు. కార్గిల్‌ యుద్ధంలో సైన్యం చూపిన అసమాన పోరు దేశ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఈ సందర్భంగా కార్గిల్‌ అమరులను స్మరించుకోవడం, వారి త్యాగాన్ని గుర్తు చేసుకోవడం ప్రతి భారతీయుడి కర్తవ్యమన్నారు. కార్యక్రమంలో ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిక్రమ్‌సింగ్‌, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఎన్‌ఏకే బ్రౌనే, నావల్‌ చీఫ్‌ ఎన్‌ఎన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.