వ్యతిరేక నిర్ణయమొస్తే గంటలోపే
సమ్మెటీఎన్‌జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్
హైదరాబాద్, జూలై 26 (జనంసాక్షి) :
నాలుగున్నర కోట్ల మంది ఆశిస్తున్న హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణకు ఏమాత్రం వ్యతిరేకంగా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నా కూడా తక్షణమే తాము మెరుపు సమ్మెకు దిగేందుకు సిద్ధంగా ఉన్నామని టీఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ ప్రకటించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాము సైతం పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. డిల్లీలో జరిగే పరిణామాలకు అనుగుణం గానే తమ నిర్ణయం ఉంటుందన్నారు. ఇప్పటివరకు కేంద్రంపై నమ్మకంతో ప్రశాంతంగా ఉంటున్నామన్నారు. ఉద్యమాలు చేయడం తమకు పెద్ద సమస్య కానే కాదన్నారు. ఇప్పటికే ప్రపంచ చరిత్రలో కొత్త కొత్త ఉద్యమాలను చేపట్టిన చరిత్ర తెలంగాణా ఉద్యోగులకు, ప్రజలకు ఉందన్నారు. జూలై 29వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేస్తున్నామన్నారు. ఈ ర్యాలీలు ఆగస్టు 5న పార్లమెంట్ ప్రారంభమయ్యే వరకు కొనసాగుతాయన్నారు. ఆ తర్వాత ఉద్యమం రూపురేఖలు తీవ్రంగా ఉంటాయన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైనప్పుడల్లా సీమాంధ్ర నేతలు అడ్డు పడుతున్నారని ఆరోపించారు. ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందన్నారు.