యూపీ విభజించరూ! తెలంగాణ బిల్లుకు సంపూర్ణ మద్దతు

బహెన్‌ మాయావతి
లక్నో, జూలై 31 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బహుజన సమాజ్‌వాదీ పార్టీ స్వాగతించింది. తెలంగాణ ఏర్పాటుకు తాము సానుకూలమని ప్రకటించింది. పార్లమెంట్‌లో బిల్లు పెడితే తాము సహకరిస్తామని, మద్దతునిచ్చి బిల్లును ఆమోదిస్తామని బీఎస్పీ చీఫ్‌, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాన్ని నాలుగు ముక్కలుగా చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. మాయావతి బుధవారం లక్నోలో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనకు కాంగ్రెస్‌, యూపీఏ సానుకూలత తెలిపిన నేపథ్యంలో.. ఆమె తెలంగాణపై స్పందించారు. తెలంగాణకు తాము ఎప్పుడూ అనుకూలమేనని పునరుద్ఘాటించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు యూపీఏ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో.. ఉత్తరప్రదేశ్‌ను కూడా విడగొట్టాలని ఆమె డిమాండ్‌ చేశారు. యూపీని నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ను విభజించినట్లే 20 కోట్ల మంది జనాభా ఉన్న అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్టాల్రుగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. యూపీ విభజనకు తన ప్రభుత్వ హయాంలో తీర్మానం చేసిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాలుగు రాష్ట్రాలుగా విభజిస్తే ప్రజలు మరింత ప్రగతిని చూస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్న రాష్ట్రాల ద్వారానే అభివృద్ధి సాధ్యమన్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ఆలోచనా విధానానికి అనుగుణంగా తాము వ్యవహరిస్తామన్నారు.