ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది
వరంగల్, (జనంసాక్షి): వరంగల్ జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నది ఉదృతంగా ప్రవహిస్తున్న కారణంగా ఏటూరు నాగారం డివిజన్‌లోని 10 గ్రామాల ప్రజలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లాలోని రామన్న గూడెం వద్ద అధికారులు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారి చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. భద్రాచలం రామయ్యను గోదావరి నది మంచెత్తింది. ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద వరదనీరు 58 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మూడో నెంబర్ ప్రమాద హచ్చరికను విడుదల చేశారు. ఖమ్మం సబ్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా పరిస్థితులను సమీక్షిస్తున్నారు. వర్షాల కారణంగా 30వ నెంబర్ జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం , వాజేడు మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.