సీమాంధ్రుల కుట్రలు కుతంత్రాలు కేసీఆర్‌ హత్యకు సుపారీ


జెడ్‌ ప్లస్‌ భద్రతకు హరీశ్‌, ఈటెల డిమాండ్‌
హైదరాబాద్‌, ఆగస్టు 6 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయడంతో సీమాంధ్ర పెత్తందారులు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆరే కారణమని ఆయన హత్యకు భారీ ప్రణాళికే రూపొందించారు. కేసీఆర్‌ హత్యకు సుపారీ కూడా ఇచ్చినట్లు సమాచారం. దీనిపై పార్టీ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్‌, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ నాలుగున్నర కోట్ల ఆశాకిరణం కేసీఆర్‌ను అంతమొందించేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని, ఆయనకు ఏమైనా జరగకూడనిది జరిగితే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని హెచ్చరించారు. కేసీఆర్‌కు జెడ్‌ప్లస్‌ భద్రత కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఈటెల, హరీశ్‌ విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ను హత్య చేయడానికి కొన్ని దుష్ట శక్తులు యత్నిస్తున్నట్లు పక్కా సమాచారముందన్నారు. కేసీఆర్‌ హత్య కోసం సుపారి కూడా ఇచ్చారని తెలిపారు. ఎవరు ఈ కుట్ర చేస్తున్నది, సుపారీ ఎవరు ఎవరికి ఇచ్చారన్నది సమయం వచ్చినప్పుడు బయటపెడతామన్నారు. మూడు రోజుల క్రితం ఇంటెలిజెన్స్‌ ఐజీని కలిసి ఆయా  వివరాలు అందజేసినట్లు చెప్పారు. అయినా ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. కుట్ర ఫోన్‌కాల్స్‌ పరంపర కొనసాగుతోందని తెలిపారు. దీనికి సంబంధించి పార్టీ తరఫున ప్రభుత్వానికి రిట్‌ పిటిషన్‌ సమర్పిస్తామన్నారు. కేసీఆర్‌ను హతమార్చాలనుకోవడం పిరికిపందల చర్య అని మండిపడ్డారు. కేసీఆర్‌ను అంతమొందించడానికి ఎవరు సుపారీ ఆఫర్‌ చేశారో, ఎవరు తీసుకోవడానికి వచ్చారో తమ పక్కా సమాచారం ఉందని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోకుండా కేసీఆర్‌కు జడ్‌ప్లస్‌ కేటగరీ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఆయన హాజరయ్యే సభలు, సమావేశాలకు గట్టి భద్రత ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం కేసీఆర్‌కు నామమాత్రపు సెక్యూరిటీ ఉందని, వెంటనే భద్రతను పెంచాలని డిమాండ్‌ చేశారు. కుట్రపై పూర్తి స్థాయి విచారణ కూడా జరిపించాలని కోరారు. కేసీఆర్‌ విషయంలో ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని విమర్శించారు. కేసీఆర్‌కు ఏమైనా జరిగితే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని, తదనంతర పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. సీమాంధ్ర దోపిడీదారులూ కేసీఆర్‌ను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ నేత కర్నే ప్రభాకర్‌ ఆరోపించారు. పోలీసులు కేసీఆర్‌ను కంటికి రెప్పలా కాపాడాలని ఆయన కోరారు. సీమాంధ్ర నేతలు ఎంతటి దుర్మార్గానికైనా పాల్పడతారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని భద్రత కల్పించాలని, లేదంటే తామే తమ నేతను రక్షించుకుంటామన్నారు.