ప్రాంతాలుగా విడిపోదాం.. ప్రజలుగా కలిసుందాం
మీట్ ది ప్రెస్‌లో కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 7 (జనంసాక్షి) :
రెండు రాష్ట్రాలుగా విడిపోయి అన్నదమ్ముల్లా కలిసుందామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. హిందీ మాట్లాడే వారికి పది రాష్ట్రాలు ఉన్నప్పుడు తెలుగు వారికి రెండు రాష్ట్రాలుంటే తప్పేమిటని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా తాము అంగీ కరించబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశా రు. తెలంగాణ కోసం 60 ఏల్లుగా అనేక ఉద్యమాలు జరిగాయని, అనేక పోరాటాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షకు అడ్డుపడొద్దని ఆయన కోరారు. బుధవారం తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో కిషన్‌రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన వివిధ ప్రశ్నలకు ఆయన సూటిగా, కులంకశంగా సమాధానాలిచ్చారు. ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలే హైకమాండ్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం విడ్డూరమన్నారు.
తెలంగాణ ఉద్యమానికి సుదీర్ఘ చరిత్ర
తెలంగాణ ఉద్యమం సుదీర్ఘ పోరాటమని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ విలీనాన్ని 1956లోనే ఇక్కడి ప్రజలు వ్యతిరేకించారన్నారు. అప్పటి నుంచీ ఇప్పటివరకూ ఉద్యమం కొనసాగుతూనే ఉందని తెలిపారు. 2009లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేస్తుందని ప్రకటన చేసి వెనక్కు పోయిందని విమర్శించారు. సుదీర్ఘ పోరాటాల అనంతరం ఇప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యంగబద్ద ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటించడం హర్షణీయమన్నారు. అయితే, ప్రకటనకు కట్టుబడి కేంద్రం రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం యత్నిస్తోందని, చిత్తశుద్ధి ఉంటే వెంటనే తెలంగాణ బిల్లును పార్లమెంట్‌కు తేవాలని కోరారు.
ఉమ్మడి రాజధానిగా ఒప్పుకోం..
హైదరాబాద్‌ను శాశ్వతంగా ఉమ్మడి రాజధాని అంటే ఒప్పుకోమని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సీమాంధ్రలో నూతన రాజధాని ఏర్పాటయ్యే వరకూ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు అభ్యంతరం లేదని తెలిపారు. అయితే, శాశ్వతంగా ఉమ్మడిగా ఉంచుతామంటే మాత్రం అంగీకరించబోమన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ అంశాన్ని వివాదం చేస్తోందని మండిపడ్డారు. గతంలో మూడు రాష్టాల్రు ఏర్పడినప్పుడు ఎలాంటి సమస్యలు తలెత్తలేదని గుర్తు చేసిన కిషన్‌రెడ్డి… ఇప్పుడెందుకు కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు.
టీడీపీ, వైఎస్సార్‌సీపీది ద్వంద్వ వైఖరి
తెలంగాణపై కొన్ని పార్టీలు యూటర్న్ తీసుకోవడం బాధాకరమన్నారు. తెలంగాణకు అనుకూలమని లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్‌సీపీ ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనడమేమిటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు అనుకూలమన్న ఆ పార్టీ నాయకులు సీమాంధ్ర ఉద్యమంలో పాల్గొనడంపై మండిపడ్డారు. టీడీపీ ద్వంద్వ వైఖరి అవలంభించి తెలంగాణను నట్టేటా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ తెలంగాణకు అనుకూలమని చెప్పి, ఇప్పుడు రాజీనామాలు చేయడంపై మండిపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకం కాదన్న టీడీపీ, వైఎస్సార్‌సీపీ సీమాంధ్రలో బీజేపీని తప్పుబట్టడం సరికాదన్నారు. ఏ పార్టీ వారైనా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దని కోరారు. కాంగ్రెస్ నేతలే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్‌దే బాధ్యత
విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా నాటకాలాడుతోందని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే హడావుడిగా నిర్ణయం తీసుకుందన్నారు. సొంత పార్టీలోనే కాంగ్రెస్ విభజనపై ఏకాభిప్రాయం తేలేకపోవడం దురదృష్టకరమన్నారు. విభజనకు అంగీకరించిన ఆ పార్టీ.. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలను ఒప్పించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని తెలిపారు. అన్ని పార్టీలు, ప్రజలను మెప్పించి, ఒప్పించే దిశగా ముందుకు వెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బిల్లు పెడితే బీజేపీ కచ్చితంగా మద్దతిస్తుందని, మిగతా పార్టీల్లాగా తెలంగాణపై బీజేపీ వెనక్కుపోదన్నారు. 2006లోనే తాము జాతీయ కార్యవర్గంలో తెలంగాణపై తీర్మానం గుర్తు చేశామన్నారు. తెలంగాణ కోసం తమ పార్టీ అగ్రనాయకత్వం కూడా పార్లమెంట్‌లో పోరాడిందని తెలిపారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను కిషన్‌రెడ్డి తోసిపుచ్చారు. రాయల తెలంగాణ కాదు.. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జేఏసీ పాత్ర ఎంతో ఉందన్నారు.