వాద్రా వ్యవహారంపై విరుచుకుపడ్డ విపక్షాలు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ వివాదాలు ఈ రోజు పార్లమెంటును కుదిపేశాయి. ఈ వ్యవహారాలపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో వాచారణ జరగాలని ప్రధాని ప్రతిపక్షం భాజపా డిమాండ్ చేసింది. లాభసాటిగా వ్యాపారం చేయడం ఎలాగో నేర్పే బిజినెస్ స్కూల్స్ దేశంలో చాలానే ఉన్నా వాటికి వెళ్లకుండానే, ఎలాంటి పెట్టుబడి పెట్టకుండానే వందలకోట్ల రూపాయలు సంపాదించడంలో వాద్రా దిట్ట అని భాజపా ఎంపీ యశ్వంత్ సిన్హా లోక్‌సభలో అన్నారు. ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఆయన దగ్గర కొన్ని సూచనలు తీసుకోవచ్చని సిన్హా వ్యాఖ్యానించగా ఆ పార్టీ సభ్యులు ‘కాంగ్రెస్ కా హాథ్, దామాద్ కే సాథ్’ అంటూ నినాదాలు చేశారు. అఖిలపక్షంలో ఈ అంశంపై పూర్తి స్థాయి చర్చ జరపాలని భాజపా కోరగా ప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రైవేటు వ్యక్తిపై సభలో చర్చించే ప్రశ్నే లేదని కేంద్ర మంత్రి మనీష్ తివారీ అన్నారు.