శాంతి మా నినాదం విషం విద్వేషాలే మీ లక్ష్యం


విభజన ఆపడం ఎవరి తరం కాదు
విడిపోయి కలిసుందాం
ఏపీ ఎన్‌జీవోలు, సీమాంధ్రులకు కోదండరామ్‌ పిలుపు
హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి) :
‘శాంతి మా నినాదం.. విషం విద్వేషాలే మీలక్ష్యమని’ టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ చైర్మన్‌ కోదండరామ్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల సుదీర్ఘ పోరాటాల ఫలితాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న సీమాంధ్ర పాలకులపైనే తమ పోరాటం ఇంకా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యుత్‌ సౌధలో తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవద్దంటూ, తెలంగాణలో విద్యుత్‌పై సీఎం అసంబద్దంగా ప్రకటనలు చేశాడని ఆరోపిస్తూ ఏర్పాటు చేసిన ఆందోళన కార్యక్రమంలో టీ జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. నల్ల జెండాలతో ఉద్యోగులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా తెలంగాణా రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ మాట్లాడుతూ తమ పోరాటం సీమాంధ్ర ప్రజలపై కానేకాదన్నారు. తాము కేవలం శాంతి సద్భావన ర్యాలీలు మాత్రమే చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు తమ ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. తెలంగాణను అడ్డుకుంటున్న సీమాంధ్ర పాలకుల మెడలు వంచే వరకు నిద్రపోమన్నారు. విభజనకు సహకరించండి వికాసం పెంచుకుందామన్నారు. రోజురోజుకు ద్వేషాలు పెంచుతూ పోతూనే కలిసి ఉందామనడం దౌర్బాగ్యమే అవుతుందన్నారు. విభజన ఆగదని కేంద్రం పదే పదే చెప్తున్నా కూడా సీమాంధ్ర పాలకులు, ప్రజాప్రతినిధులు అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఇంతదూరం తెచ్చుకున్నోళ్లం రాష్ట్రం ఏర్పాటు చేయించుకునే స్థితిలో తాము లేమనుకోవడం సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, పాలకుల అవివేకానికి నిదర్శనమన్నారు. విభజనకు సహకరించాలని మరోసారి కోరుతున్నట్లు కోదండరామ్‌ పిలుపునిచ్చారు. విడిపోయిన తర్వాత వచ్చే సమస్యలు కలిసి కూర్చుని చర్చించుకుని వాటిని సాధించుకునేందుకు కేంద్రంపై కలిసి పోరాడుదామన్నారు. అందుకు సీమాంధ్రులతో కలిసి వచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. విభజన తర్వాత సీమాంధ్రలో ఉన్న సమస్యలు ఏజెండాలో వచ్చేలా పోరాటాలు చేయాలని సీమాంధ్రులకు కోదండరాం పిలుపునిచ్చారు. కలిసి ఉందామనేది అరిగిపోయిన రికార్డేనన్నారు. సీమాంధ్ర ప్రజలు నాయకులపై ఒత్తిడి తెచ్చి సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేసేలా జ్ఞానం కలిగించాలని కోరారు. విభజన వికాసానికే అని తెలంగాణ జేఏసి ప్రగాఢంగా విశ్వసిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును క్యాబినెట్‌లో వెంటనే పెట్టాలని, అలాగే ఈపార్లమెంట్‌లోనే బిల్లుపెట్టి సమస్యను పూర్తి చేయాలని కోదండరాం కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. శాంతిస్థాపన కోసమే తాము సద్బావన ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా గురువారం, శుక్రవారం కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కవి దేశ్‌పతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ నేడు సమైక్యాంధ్ర జేఏసీ చైర్మన్‌ సామ్యూల్‌ లేనే లేడని ఆ పోస్టులో నేడు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూర్చున్నాడని, అలాగే కో చైర్మన్‌గా డీజీపీ దినేష్‌రెడ్డి కూర్చున్నాడని ఆరోపించారు. ఫక్తుగా తాను హైదరాబాదీని, మై హైదరాబాదీ హూం అంటూ గొంతు చించుకుంటున్న కిరణ్‌కుమార్‌రెడ్డికి వాస్తవం తెలియదన్నారు. ఎవరైతే తెలంగాణా వారి దుఃఖంలో, బాధలో పాలు పంచుకుంటారో వారే తెలంగాణ వారు,వారే హైదరాబాదీలు అవుతారన్నారు. హైదరాబాద్‌ చెరువులు కబ్జాకు చేసుకున్న వారు, భూములను లాక్కుని లక్షల కోట్లు సంపాదించుకున్న వారు తెలంగాణా వారు కానే కాదన్నారు. సీమాంధ్రకు చెందిన గజల్‌ శ్రీనివాస్‌ నేడు పోలీసులతో తిరుగాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణాకు చెందిన తాము ఏనాడైనా పోలీసులను వెంటేసుకుని గ్రామాలకు, పట్టణాలకు పోయామా అని ప్రశ్నించారు. గాయకులంటే ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలని కేవలం విషంకక్కుతూ స్వార్థంతో పనిచేసే వారికే పోలీసులు అవసరం అవుతారని దుయ్యబట్టారు. పక్కా సమైక్యవాదిగా ఉన్న పరకాల ప్రభాకర్‌కు వాస్తవం తెలియడం లేదని ఎద్దేవా చేశారు. 2500 సంవత్సరాలుగా తెలుగు వారు కలిసి ఉన్నారని చెప్పడం ఆయన అవివేకానికి నిదర్శనమేనన్నారు. 2500 సంవత్సరాలు గాకు 3000సంవత్సరాలని, అయితే ఇందులో కలిసి ఉన్నది కేవలం 600 సంవత్సరాలేనని చరిత్ర చదివి తెలుసుకోవాలన్నారు. 1956కు ముందు తెలుగువారు ఎక్కడ కలిసి ఉన్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీమాంధ్ర విూడియా విషప్రచారం కక్కుతోందని, దీనిని మార్చుకోకపోతే ప్రజల్లో చులకన అయిపోవడం ఖాయమన్నారు. వాస్తవాలను ప్రతిబింబించేలా ఉండాలి కాని లేనిద ఉన్నట్లు, ఉంటే గింటే కొంచెం ఉన్నా భారీగా చూపించి ప్రజలను రెచ్చగొట్టవద్దన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి, ఉద్యోగ జేఎసి నేతలు విఠల్‌ తదితరులు పాల్గొనగా, కార్యక్రమానికి విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ రఘు నాయకత్వం వహించారు. సాయంత్రం వరకు కూడా ఆటపాటలతోనే విద్యుత్‌సౌధలో కార్యక్రమం కొనసాగింది.