సిరియాలో రసాయన దాడి
వందలాది మంది మృతి
డమాస్కస్, (జనంసాక్షి) :
అంతర్యుద్ధం, ఆకలితో అలమటిస్తున్న సిరియా బుధవారం రసాయన దాడితో వణికిపోయింది. విష రసాయనాలు పీల్యుకున్న వందలాది మంది పౌరులు మృత్యువాత పడ్డారు. ఈ దాడికి సైన్యమే పాల్పడటం గమనార్హం. సిరియా అధ్యక్షుడు బషల్ అల్ అసద్‌కు వ్యతిరేకంగా డమాస్కస్ తూర్పు జిల్లాలో ఆందోళన నిర్వహిస్తున్న వారిపై సైన్యం విచక్షణ రహితంగా రసాయన ఆయుధాలను ప్రయోగించింది. దీంతో సంఘటన స్థలంలోనే 650 మందికి పైగా మృతిచెందినట్లు ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. మరో ఆరు వందల మందికి పైగా వివిధ ఆస్పత్రుల్లో మరణించినట్లు ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. సిరియా అధ్యక్షుడే సైన్యంతో నరమేధానికి పాల్పడ్డానని అవి అభివర్ణించాయి. సిరియా అధ్యక్షుడు, సైన్యం ఆగడాలను నియంత్రించేందుకు అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని అవి కోరాయి. సిరియాలో రసాయన ఆయుధాల ప్రయోగాన్ని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్తామని బ్రిటన్ పేర్కొంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని, బాంబు దాడులు ఇంకా కొనసాగుతున్నాయని సిరియా మానవ హక్కుల అబ్జర్వేటరీ పేర్కొంది. విష వాయువులు పీల్చుకున్న వారు, రసాయన ఆయుధాల ప్రభావానికి లోనైన వారిలో చాలా మంది మరణించారని అబ్జర్వేటరీ తెలిపింది. అయితే డెమాస్కస్‌కు తూర్పు ప్రాంతంలోని ఘౌటాలో రసాయన ఆయుధాలు వినియోగించారనే ప్రచారం అవాస్తవమని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సిరియా సమాచార మంత్రి ఓమన్ జొబాయి జాతీయ టెలివిజన్‌తో మాట్లాడుతూ ఇది అబద్ధపు ప్రచారమని తెలిపారు. అంతర్జాతీయ పౌర సమాజం వెంటనే సిరియా మారణ హోమంపై జోక్యం చేసుకోవాలని అక్కడి ప్రతిపక్షాలు చేసిన విజ్ఞప్తికి బ్రిటన్ సహా పలు దేశాలు స్పందించాయి. సిరియా ఆకలిపై పోరాటానికి ప్రాధాన్యమిస్తే మంచిదని, అధికారం కోసం అంతర్యుద్ధానికి దిగితే మొదటికే మోసం వస్తుందని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి.