అధోపాతాళానికి రూపాయి


నింగినంటిన పసిడి
క్లిష్ట పరిస్థితుల్లో దేశం
ముంబయి, ఆగస్టు 28 (జనంసాక్షి) :
దేశీయ మారకద్రవ్యం రూపాయి అధోపాతాళానికి చేరింది. పసిడి మిడిసి పడింది. దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. రూపాయి విలువ పతనం కొనసాగుతోంది. బుధవారం మరింత దిగజారి ఆల్‌టైం హై రికార్డును బద్దలు కొట్టింది. డాలర్‌తో మారకపు విలువ అత్యంత కనిష్ట స్థాయిలో రూ.68.75గా నమోదైంది. తాజా పరిణామాలతో విదేశీ పెట్టుబడులు హరించుకుపోతున్నాయి. పెట్టుబడిదారులు హడలిపోతున్నా రు. పడిపోతున్న రూపాయి విలువ, పెరిగిపోతోన్న ద్రవ్యోల్బణం తదితర పరిణామాలతో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. దేశ ఆర్థిక పరిస్థితి మందగమనంలో పడిపోయింది. రూపాయి పతనం కొనసా గుతుందని, ఇది రూ.75కు చేరవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అంచ నా వేస్తున్నారు. రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనమవడంతో స్టాక్‌ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ 450 పాయింట్లకు పైగా నష్ట పోగా, నిఫ్టీ 120 పాయింట్ల నష్టాల్లో ట్రేడవుతోన్నాయి. డాలర్‌కు డిమాం డ్‌ పెరగడంతో రూపాయి పతనమవుతోంది. ఇది బ్యాంకులు, స్టాక్‌ మార్కెట్లు, దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశీయ కరెన్సీ పతనం కావడం, ఆహార భద్రత బిల్లు ఆమోదంతో భారీగా సబ్సిడీ భారం పడనుండడం తదితర కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దీంతో విదేశీ పెట్టుబడిదారులు డాలర్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే షేర్‌ మార్కెట్లు భారీగా నష్టాలు చవిచూడగా, అటు క్రూడాయిల్‌ ధరకు రెక్కలొచ్చాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. పెట్రోల్‌పై రూ.5 వరకు పెరుగొచ్చని పెట్రోలియం శాఖ వర్గాలు తెలిపాయి.

సామాన్యులపై పెనుప్రభావం
రూపాయి పతనం ఆర్థిక వ్యవస్థతో పాటు సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రధానంగా నిత్యావసర వస్తువులు, ఆహార ధాన్యాల ధరలకు రెక్కలొస్తాయి. గ్యాస్‌, కరెంట్‌ చార్జీలపై మరింత భారం పడనుంది. ఆర్టీసీ చార్జీలు పెంచకతప్పని పరిస్థితి ఏర్పడుతుంది. సిగరెట్లు, సబ్బులు, సెల్‌ఫోన్లు మరింత ప్రియం కానున్నాయి.
బంగారం ధరకు రెక్కలు
రూపాయి పతనంతో బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. బుధవారం బంగారం ధర భారీగా పెరిగింది. ఒక్క రోజులోనే తులం ధర రూ.2 వేలకు పైగా పెరిగింది. పది గ్రాముల బంగారం ధర రూ.34,500కు చేరింది. కాగా, కిలో వెండి రూ.59,800 పలికింది. బంగారం ధర గత రికార్డును బద్దలు కొట్టింది. గతేడాది నవంబర్‌లో తులం బంగారం రూ.32,975గా పలికింది. ఇదే అత్యధిక ధర. ఈ రికార్డు బుధవారంతో తుడిచిపెట్టుకుపోయింది. ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోవడం, రూపాయి పతనం కొనసాగుతుండడం, స్టాక్‌మార్కెట్లు నష్టాల బాటలో కొనసాగుతుండడంతో పెట్టుబడిదారులు బంగారం కొనుగోళ్లపై దృష్టి సారించారు. దీంతో బంగారం ధర అమాంతం పెరిగిపోయింది.
ఆసియా మార్కెట్లు డమాల్‌..
సిరియా సంక్షోభం ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. సిరియాపై అమెరికా సైనిక చర్యకు దిగనున్నట్లు వస్తున్న వార్తలతో ఆసియా స్టాక్‌మార్కెట్లలో సంక్షోభాన్ని సృష్టించింది. ఇప్పటికే రూపాయి భారీగా పతనమైంది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న రూపాయితో పాటు ఆర్థిక వ్యవస్థ దిగజారుతోంది.