న్యాయం లేని సమన్యాయం
తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలుంటే తప్పేంటి
హైదరాబాద్ ముమ్మాటికీ తెలంగాణలో అంతర్భాగం
డెప్యూటీ సీఎం దామోదర
నల్గొండ, ఆగస్టు 30 (జనంసాక్షి) :
ముఖ్యమంత్రి చెప్పిన సమన్యా యంలో న్యాయమే లేదని డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అ న్నారు. తెలుగు ప్రజలకు రెండు రా ష్ట్రాలు ఉంటే తప్పేమిటని ఆయన ప్ర శ్నించారు. తెలుగు వారు రెండు రాష్ట్రాల్లో ఎందుకు ఉండకూడదని ఇందుకు సరైన సమాధానం చెప్పే దమ్ము దైర్యం సీమాంధ్రులకు ఉందా అని ఆయన నిలదీశారు. నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలోని లక్ష్మినరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణా ఇస్తామని కాంగ్రెస్ రెండు ఎన్నికల్లో కూడా స్పష్టంగా చెప్పిందన్నారు. ఎన్నికల సమయంలో నోరు మెదపని నేతలు నేడు అలాంటిది ఏమి లేదని చెప్పడం దుర్మార్గమే అవుతుందన్నారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమేనన్నారు. దీనిపై మరో మాటే లేదన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించుకునేందుకు కలిసిమెలిసి ప్రయత్నిద్దామని సీమాంధ్రులకు హితవు పలికారు. 9 సంవత్సరాల తర్వాత, 2009 డిసెంబర్ ప్రకటన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో సంప్రదింపులు, చర్చలు నిర్వహించిందని గుర్తు చేశారు. నిన్నటికి నిన్న హైదరాబాద్‌లో దిగ్విజయ్‌సింగ్ సీఎల్పీ సమావేశంలో కూడా తెలంగాణపై నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పినప్పుడు నోరు మెదపని సీమాంధ్ర నేతలు, ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఇలా రాంగ్ రూట్లో వ్యతిరేకించడం ముమ్మాటికి క్రమశిక్షణ చర్యే అవుతుందన్నారు. తెలంగాణ ప్రకటన అయిపోయిందని, ఇంకెన్ని సార్లు ప్రయత్నించినా కూడా కాంగ్రెస్ వెనక్కుపోదని చెప్పుతున్నా కూడా పదవులు కట్టబెట్టిన, కోట్లాది రూపాయల వ్యాపారాలను చేసుకునేందుకు మార్గాలు చూపించిన కాంగ్రెస్ అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యవహరించడం దుర్మార్గమే అవుతుందన్నారు. ముఖ్యమంత్రికి తెలంగాణ ఆందోళనలు, ఆవేదన ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు. సీమాంధ్రలో ఆందోళనలకు నేడు సంపూర్తిగా మద్దతిస్తున్న సీఎం ఆందోళనలను వెనుకుండి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో తమపై కూడా పోలీసులను ఉసిగొల్పి ఉక్కుపాదం మోపిన కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు సీమాంధ్రులపై ఏం చర్యలు తీసుకుంటున్నారో గళమెత్తి చెప్పగలరా అని ప్రశ్నించారు. ప్రాంతాల అభివృద్ధిలో చూపిన వివక్షనే నేడు కూడా ఆందోళనల్లో చూపిస్తూ సీమాంధ్రులు తెలంగాణ వారిని ఇంకా ఇంకా రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. సీమాంధ్రలో ఆందోళనలు ముమ్మాటికి కేవలం కృత్రిమం, నాయకులు, పెట్టుబడి దారులు చేస్తున్న వ్యవహారాలేనని డెప్యూటీ సీఎం ఆరోపించారు. దీనికి సీఎం స్క్రీన్, ప్లే, డైరెక్షన్ నిర్వహిస్తున్నాడని ఆరోపించారు. ముఖ్యమైన పదవిలో ఉండి ఓప్రాంతానికి పక్షపాతంగా వ్యవహరించడాన్ని భగవంతుడు ఏనాడూ కూడా క్షమించడన్నారు. తెలంగాణ ప్రజల మనోబావాలు మాత్రం ఎందుకు పట్టడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో ఓట్లు, సీట్లు మాత్రం కావాలిగాని ప్రజల ఆకాంక్షలు నెరవేరవద్దా అని కిరణ్‌ను నిలదీశారు. వైఎస్ జగన్ చేస్తున్న దీక్షలో అర్థం లేదన్నారు. 2004లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు సీఎం ఎందుకు వ్యతిరేకించలేదన్నారు. ఎవరెన్ని అసందర్భ వ్యాఖ్యలు చేసినా కూడా తెలంగాణ సాధించుకుని తీరుతామని, అదీ హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు చేసుకుంటామన్నారు. తెలంగాణవాదులను సీమాంధ్రులు రెచ్చగొడుతున్నా కూడా సంయమనంతో వ్యవహరిస్తున్నామన్నారు. తాము తలుచుకుంటే మాత్రం సీమాంధ్రులు ఎక్కడుంటారో చూసుకోవాలన్నారు. అయినా తమ సంస్కృతి అది కాదన్నారు. పొట్టలు చేతపట్టుకుని వచ్చిన వారిని అక్కున చేర్చుకునే తత్వం తెలంగాణ ప్రజలదని, పొట్టలు కొట్టడం సీమాంధ్రులకు వెన్నతో పెట్టిన విద్యగా మారిందన్నారు. సీమాంధ్రలో ఉన్న తెలంగాణ వారిని ఏవిధంగా హింసిస్తున్నారో బాహ్యప్రపంచం చూస్తున్నా కూడా సీఎం, పీసీసీ అధ్యక్షుడు, ఇతర మంత్రులు మాత్రం కనీసం పల్లెత్తు మాట కూడా మాట్లాడక పోవడం నీచాతి నీచమైన వ్యవహారమే అవుతుందన్నారు. హైదరాబాద్‌లో ఉన్నవారంతా తాము తెలంగాణవారుగానే చూస్తున్నామని, సీమాంధ్రుల్లాగో, సీఎంలాగో తెలంగాణ వారిని వేరే వారుగా భావించడం లేదన్నారు. అదీ మీకు మాకు ఉన్న తేడా అని సిఎంకు చురకలు అంటించారు. ఇప్పటికైనా ఒకప్రాంతానికి వత్తాసు పలుకడం మానుకోవాలని దామోదర రాజనర్సింహ సీఎంకు హితవు పలికారు. లక్ష్మి నర్సింహస్వామి దర్శనానికి వచ్చిన ఉపముఖ్యమంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. వేదోచ్చరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లా నేతలు పలువురు పాల్గొన్నారు.