7న ఉమ్మడి జిల్లా ప్రచార సభ

ఏర్పాట్లలో నేతల బిజీ
ప్రచారవేదిక కోసం స్థలాన్వేషణ
వరంగల్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): ఉమ్మడి వరగంల్‌ జిల్లాలో కెసిఆర్‌ పాల్గొనే బహిరంగ సభను దిగ్విజయం చేసేందుకు నేతలు వ్యూహం పన్నుతున్నారు. భారీగా జనాలను రప్పించి విపక్షాలకు సవాల్‌ విసరాలని చూస్తున్నారు.  7న వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో నిర్వహించాలని అధిష్ఠానం నిర్ణయించింది. అనంతరం నోటిఫికేషన్‌ వెలువడ్డాక నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. సీఎం కేసీఆర్‌ సభా వేదికగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని, ప్రజలు తమను ఆశీర్వదించాలని కోరనున్నారు. అక్టోబర్‌ 3న నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా కేంద్రం నుంచి మొదలయ్యే ఈ సభా పరంపర వరంగల్‌ ఉమ్మడి జిల్లా కేంద్రంలో అన్ని నియోజకవర్గాలతో ఎన్నికల సభను నిర్వహిస్తామని తెలంగాణ భవన్‌ విడుదల చేసిన ప్రకనటలో స్పష్టం చేసింది.  ఇప్పటికే అభ్యర్థులు ఊరూరా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గ్రామ గ్రామాన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్న వాతావరణం నెలకొంది. పలు కుల సంఘాలు మునుపెన్నడూ లేనివిధంగా టీఆర్‌ఎస్‌కు ఆకర్షితులై మద్దతు ప్రకటిస్తున్నాయి. కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ సహ ఎన్నికల బరిలో నిలిచే రాజకీయ పార్టీలు పొత్తుల ఎత్తులతో చిత్తయిపోతున్నాయి. మహాకూటమి పొత్తులతో ఎటూ తేల్చుకోని స్థితిలో ఎవరికి ఏ సీటు అన్న విూమాంసతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచార పర్వాన్ని పతాకస్థాయికి తీసుకెళ్తున్నారు.సీఎం కేసీఆర్‌ తొలిదశ ఎన్నికల ప్రచారాన్ని ఉమ్మడి జిల్లా కేంద్రంగా బహిరంగ సభలు నిర్వహించాలని భావించారు. అధినేత పై భారం వేసిన అభ్యర్థులు ఇప్పటికే తమతమ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు.