కేంద్ర ఉద్యోగులకు 7శాతం పెరగనున్న డీఏ
న్యూఢిల్లీ, ఆగస్టు 31 (జనంసాక్షి) : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు ప్రస్తుతం ఉన్న 100 శాతం కరవు భత్యం (డి.ఎ.) ఇకపై 107 శాతానికి చేరే అవకాశాలున్నాయి. ప్రభుత్వం దీనిని ఆమోదిస్తే దాదాపు 30లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 50 లక్షల మంది పింఛన్‌దారులు లబ్ధి పొందనున్నారు. 1.7.2013 నుంచి 30.6.14 కాలానికి పారిశ్రామిక కార్మికులకు ద్రవ్యోల్బణం సగటు రేటు 7.25శాతం ఉన్నందువల్ల కేంద్రం తమ ఉద్యోగులకు 7శాతం డి.ఎ. పెంచవచ్చని ఒక అధికారి వెల్లడించారు. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రిమండలికి ప్రతిపాదన సమర్పిస్తుందని చెప్పారు. డి.ఎ.ను మూలవేతనంలో విలీనం చేయాలన్న తమ డిమాండుకు ప్రభుత్వం ఆమోదం తెలపకపోవడంపై కేంద్ర ఉద్యోగ సంఘాలు మాత్రం అసంతృప్తితో ఉన్నాయి. ఏడో వేతన సంఘం ద్వారా ఈ అంశాన్ని ప్రభుత్వానికి నివేదించామనీ, ఇప్పటి వరకు నిర్ణయం వెలువడలేదని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.కె.ఎన్.కుట్టి తెలిపారు. డి.ఎ.ను విలీనం చేస్తే మూల వేతనం ఆధారంగా లభించే జీతం, భత్యాల్లో పెరుగుదల ఉంటుందన్నారు. డి.ఎ. 50శాతం దాటితే దానిని మూల వేతనంలో విలీనం చేయడమనే పద్ధతి గతంలో ఉండేది. ఆరో వేతన సంఘం దానిని అనుమతించలేదు.