మండల స్థాయి వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని ప్రారంభించిన సీఎం
హైదరాబాద్: మండల స్థాయి వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. తన సొంత మండలమైన కలికిరి తహశీల్దార్‌తో సీఎం తొలిసారి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా మండల స్థాయి వరకు వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ప్రభుత్వంలో పారదర్శకత తీసుకురావాలన్నదే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రజలను సాంకేతికతకు చేరువ చేసేందుకు ఉపయోగపడే కార్యక్రమాలను రూపొందిస్తున్నామని, ప్రజల సేవలో అధికారులు పునరంకితం కావాలని సీఎం సూచించారు. ఇకపై 23 జిల్లాల కలెక్టర్లతో పాటు 1126 మండలాల్లో వీడియో కాన్ఫరెన్స్ విధానం అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి పొన్నాల అక్ష్మయ్య పాల్గొన్నారు.