కీలక సమయం
అప్రమత్తంగా ఉండాలి : కోదండరామ్
హైదరాబాద్, డిసెంబర్ 11 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు శాసనసభ ముందుకు వస్తోన్న ప్రస్తుత తరుణం అత్యతం కీలకసమయమని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఇలాంటి సమయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అసెంబ్లీలో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉండి రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు పక్రియ కేంద్రానికి చేరేలా చూడాలని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా అందరు ఉమ్మడిగా పోరాడాలన్నారు. ఇందుకోసం అన్ని పార్టీల తెలంగాణ నేతలను కలసి కోరుతామన్నారు. ఈ దశలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన అధ్యక్షతన నిర్వహించిన తెలంగాణ జేఏసీ విస్తృతస్థాయి సమావేశం అనంతరం కోదండరామ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిల్లులో ఉన్న అంశాలపై సవరణలు చేసేందుకు రెండ్రోజుల్లో ఢిల్లీ వెళ్తామని, సవరణలు సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అందరూ ఐక్యంగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రాంత నాయకులందరిని కలిసి వ్యక్తిగతంగా బిల్లు విషయంలో ఐక్యంగా ఉండాలని కోరుతామన్నారు. మరోవైపు టీ టీడీపీ ఫోరం నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుతో బుధవారం సాయంత్రం టీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. అసెంబ్లీలో సీమాంధ్ర కుట్రలను ఓడించేందుకు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలంతా ఐక్యంగా పోరాడాలని, దీనికి టీ టీడీపీ ఫోరం కూడా కలిసి రావాలని కోదండరాం ఎర్రబెల్లిని కోరినట్లు సమాచారం. ఇప్పుడు ప్రజల ఆకాంక్షల తరఫున నిలవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఉందని వారు అన్నారు.