తెలంగాణ ఆలస్యం లేదు

తెరాస విలీనంతో సంబంధం లేదు : డీఎస్‌
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 23 (జనంసాక్షి) :
తెలంగాణ ఏర్పాటు ఆలస్యం కాబోదని పీసీసీ మాజీ చీఫ్‌, ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్‌ తెలిపారు. తెలంగాణ బిల్లు రాష్ట్ర శాసనసభ, మండలి అభిప్రాయం కోసం వచ్చిన నేపథ్యంలో జాప్యం జరుగుతుందనే ప్రచారం వట్టిదేనని ఆయన పేర్కొన్నారు. 2014 ఎన్నికలలోపే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని డీఎస్‌ చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2014 ఎన్నికలు రెండు రాష్ట్రాల్లోనూ జరుగుతాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాగత అంశాలపై చర్చించేందుకు సోనియాను కలిసినట్లు చెప్పారు. తెలంగాణకు సంబంధించే కాకుండా, సీమాంధ్రకు సంబధించిన రాజకీయ అంశాలపై కూడా చర్చించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. 2009లో కేంద్రం ప్రకటించిన తెలంగాణ ప్రక్రియకు కొనకసాగింపుగానే ఇప్పుడు చర్యలు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో ఉన్న సీమాంధ్రులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. బీజేపీ కూడా పార్లమెంట్‌లో తెలంగాణకు పూర్తి స్థాయి మద్దతు ఇస్తుందని చెప్పారు.