ఆమ్‌ఆద్మీలో చీలిక!

కేజ్రీవాల్‌పై భగ్గుమన్న బిన్నీ

హామీలను గాలికొదిలేశారని ఆరోపణ

విదేశీ మహిళపై జరిగిన అత్యాచారంపై

ఎందుకు స్పందించలేదని నిలదీత

వెనుక కాంగ్రెస్‌ హస్తం?

న్యూఢిల్లీ, జనవరి 16: ఇటీవల పురుడుపోసుకొని అతికొద్ది కాలంలో ఢిల్లీ పీఠాన్ని అధిష్టించి సంచలనం సృష్టించిన ఆమ్‌ఆద్మీపార్టీలో అప్పుడే ముసలం పుట్టింది. ఢిల్లీ ఎన్నికల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న షీలాదీక్షిత్‌ను చిత్తుగా ఓడించిన ఆపార్టీ వ్యవస్థాపకుడు అరవింద్‌ కేజ్రీవాల్‌పై అప్పుడే విమర్శలు ప్రారంభమయ్యాయి. మంత్రి పదవి తనకు ఇవ్వనందుకు మంత్రివర్గ ఏర్పాటు చేసిన రోజే ధిక్కారస్వరాన్ని వినిపించిన వినోద్‌కుమార్‌ బిన్నీ తిరుగుబాటు ప్రకటించారు. షీలాదీక్షిత్‌ మంత్రివర్గంలో ఆర్థికమంత్రిగా ఉండి, గట్టి పట్టున్న నాయకుడిగా పేరున్న డాక్టర్‌ ఏకే వాలియాను లక్ష్మినగర్‌ నియోజవర్గం నుంచి ఓడించి ఆమ్‌ఆద్మీహీరోగా నిలిచిన వినోద్‌కుమార్‌ తిరుగుబాటు కేజ్రీవాల్‌కు పెద్ద ఇబ్బందిగా పరిణమించింది. ఢిల్లీ పీఠాన్ని అధిష్టించడం ద్వారా దేశంలో అన్ని రాష్ట్రాల్లో విస్తరించి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితికి వెళ్లాలని ప్రయత్నాలు ప్రారంభించిన ఆమ్‌ఆద్మీకి పార్టీకి వినోద్‌కుమార్‌ బిన్నీ కంట్లో నలుసుగా మారారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేజ్రీవాల్‌పై నిప్పులు చెరిగారు. కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఢిల్లీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఆమ్‌ఆద్మీపార్టీ ఏర్పడింది ప్రజాసమస్యల పరిష్కారం, అవినీతి వ్యతిరేక ఉద్యమం కోసమే తప్ప కొందరు వ్యక్తులను ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలకు కాదన్నారు. కేజ్రీవాల్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కనీసం ప్రయత్నం చేయడం లేదని, కేజ్రీవాల్‌ చెప్పేదొకటి, చేసేదొకటి అంటూ ఎద్దేవా చేశారు. ఆమ్‌ఆద్మీపార్టీ మేనిఫెస్టోలో పలు హామీలను ఇచ్చిందని, కానీ వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు. మంచినీరు. విద్యుత్‌పై ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ఇంకా పలు అంశాలపై ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వెనకడుగు వేస్తోందని ఆరోపించారు. హామీలను అమలు చేసేందుకు కేజ్రీవాల్‌ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని, ఎన్నికల్లో పోటీచేసి పెద్ద తప్పు చేసిందన్నారు. కేజ్రీవాల్‌ ఇప్పుడు అధికారాన్ని అనుభవించడం తప్ప ప్రజలను కనీసం పట్టించుకునే నాథుడు కరువయ్యారు. మీడియాలో ప్రచారానికే ప్రాముఖ్యత ఇస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఆయన అసలు రంగు త్వరలోనే బయటకు వస్తుందన్నారు. కాంగ్రెస్‌ అవినీతిపై పోరాటం చేస్తామని, ఆ పార్టీని మట్టి కరిపిస్తామని చెప్పిన కేజ్రీవాల్‌కు మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ తనయుడు ఎంతో ఆప్తుడని ఆరోపించారు. 50 సంవత్సరాల డెన్‌మార్క్‌ మహిళపై ఢిల్లీ నడిబొడ్డున సామూహిక అత్యాచారం జరిగితే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదన్నారు. గతంలో నిర్భయ అత్యాచార ఘటనపై గొంతు చించుకొని రోడ్డెక్కిన కేజ్రీవాల్‌ షీలాదీక్షత్‌ వైఫల్యంగానే ఈ ఘటన జరిగిందంటూ ఉద్యమించారని, ఇప్పుడు అదే ఒక విదేశస్తురాలిపై అఘాయిత్యం జరిగితే ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. కేజ్రీవాల్‌పై అప్పుడే ఎదురుదాడి ప్రారంభమైంది. ఇదిలా ఉండగా మంత్రి పదవి రాకపోయినా, ఎంపీగా పోటీ చేసేందుకైనా తన పేరు పరిగణలోకి తీసుకోవాలని బిన్నీ కేజ్రీవాల్‌ను కోరినట్లు తెలిసింది. అయితే బిన్నీ పేరు ఖరారు చేయకపోవడంతో ఆయన తిరుగుబాటు చేసినట్లు తెలిసింది. వృత్తిరీత్య వ్యాపారస్తుడైన బిన్నీ 2007లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2009లో ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అన్నాహజారే ఆధ్వర్యంలో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 2010లో ఢిల్లీ మునిసిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించిన బిన్నీ ఆ తర్వాత కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి ఆమ్‌ఆద్మీపార్టీలో చేరారు. ప్రస్తుతం పార్టీలో చీలిక తెచ్చేందుకు యత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీని వెనుక కాంగ్రెస్‌ హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.