74శాతం హెచ్1-బీ వీసాలు భారతీయులకే
– రెండో స్థానంలో చైనా
వాషింగ్టన్, మే8(జనం సాక్షి) : అమెరికా 2016లో జారీ చేసిన హెచ్1-బీ వీసాల్లో భారత సాంకేతిక నిపుణులు 74.2 శాతం పొందారు. ఆ తర్వాతి సంవత్సరానికి ఇది 75.6 శాతానికి పెరిగిందని ఓ నివేదిక వెల్లడించింది.
అయితే భారత్ నుంచి కొత్తగా హెచ్1-బీ వీసా లబ్దిదారుల సంఖ్యలో మాత్రం తగ్గుదల నమోదైంది. ఇక హెచ్1-బీ వీసాల విషయంలో భారత్ తర్వాత చైనా 9శాతంతో రెండో స్థానంలో ఉంది. 2016లో చైనీయులు 9.3 శాతం హెచ్1బీ వీసాలు పొందితే.. ఆ తర్వాతి ఏడాదిలో 9.4 శాతం పొందారు. ‘2017లో ఆరంభ ఉపాధి కోసం ఆమోదించిన భారత లబ్ధిదారుల సంఖ్య 4.1 శాతం తగ్గింది. అలాగే నిరంతర ఉపాధి కోసం ఆమోదించిన లబ్ధిదారుల సంఖ్య ఇదే ఆర్థిక సంవత్సరంలో 12.5 శాతం పెరిగింది.’ అని అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ యూఎస్‌సీఐఎస్ వెల్లడించింది. ‘క్యారక్టరిస్టిక్స్ ఆఫ్ హెచ్1బీ స్పెషాలిటీ ఆక్యుపేషన్ వర్కర్స్’ పేరిట విడుదల చేసిన ఈ నివేదికలో పలు వివరాలు వెల్లడించింది.
016లో ఆరంభ ఉపాధి కోసం భారతీయులు 70,375 హెచ్1-బీ వీసాలు పొందితే అది 2017నాటికి 67,815కి తగ్గింది. అయితే నిరంతర ఉపాధి కోసం 2016లో 1,85,489 వీసాలు పొందితే ఆ సంఖ్య 2017లో 2,08,608కి పెరిగింది. మొత్తం 2016లో భారతీయులు 2,56,226 హెచ్1-బీ వీసాలు పొందితే.. ఆ సంఖ్య 2017నాటికి 2,76,423కు చేరింది. ఇందుకు సంబంధించిన నివేదికను ఈ ఏడాది ఏప్రిల్ 10న అమెరికా సెనేటర్లకు పంపగా.. ఆ నివేదికను ఈ వారం బహిర్గతం చేశారు.