త్వరలో తెలంగాణ ఆవిర్భావం
రెండు రాష్ట్రాలకు పీసీసీలు : దిగ్విజయ్‌సింగ్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26 (జనంసాక్షి) :
త్వరలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడుతుందని తెలిపారు. సీమాంధ్ర, తెలంగాణకు వేర్వేరుగా పీసీసీలు, ఎన్నికల కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఢిల్లీలో బుధవారం సోనియాతో సీమాంధ్ర నేతలు బొత్స, రఘువీర, ఆనం, వట్టి, కొండ్రు మురళి తదితరులు భేటీ అయ్యారు. సీమాంధ్ర అభివృద్దికి ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని కోరారు. వివిధ అంశాలపై వారు అధినేత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. ఇందులో దిగ్విజయ్ కూడా పాల్గొన్నారు. భేటీ ముగిసిన అనంతరం దిగ్విజయ్ మీడియాతో మాట్లాడుతూ రెండు ప్రాంతాల్లో ఎన్నికల కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సీమాంధ్ర రాజధాని, హైకోర్టుల ఏర్పాటును కమిటీ నిర్ణయిస్తుందని వెల్లడించారు. రెండు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా వివరించారు. మార్చి నెలలో సీమలో, కోస్తాలో భహిరంగ సభలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సభలకు సోనియా, రాహుల్ హాజరవుతారని చెప్పారు. సోనియాతో భేటీ అయినప్పుడు పార్టీ విలీనంపై కేసీఆర్ చర్చించారని, విలీనం విషయంలో తదుపరి అంశాలపై చర్చించాల్సి ఉందన్నారు. గత పదేళ్లలో కాంగ్రెస్ చేసిన వాగ్దానాలను నిలబెట్టుకుందన్నారు. సీమాంధ్రకు కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లు ప్రత్యేక ప్రతిపత్తి ¬దా కల్పిస్తుందని వివరించారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధికి ఇరు ప్రాంతాలు పోటీ పడాలని దిగ్విజయ్ పేర్కొన్నారు. సోనియా, రాహుల్‌తో ఆంధ్రా, రాయలసీమలో బహిరంగసభలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.రెండు ప్రాంతాల్లో అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. నిన్న, నేటి సమావేశాల్లో సీమాంధ్ర నేతలు పలు సూచనలు చేశారని దిగ్విజయ్ వెల్లడించారు. ఇందులో భాగంగానే రెండు ప్రాంతాలకు త్వరలో రెండు పిసిపిలను ఏర్పాటు చేయనున్నట్లు సింగ్ చెప్పారు. వెనుకబడిన ప్రాంతాలకు ఐదేళ్ల వరకు ప్రత్యేక ¬దా కల్పించనున్నట్లు తెలిపారు. ఎన్నికల కోసం వ్యూహాలను రచిస్తున్నామని పేర్కొన్నారు. కొత్త రాష్ట్రం త్వరలోనే పని మొదలు పెడుతుందన్నారు. కొత్తగా ఏర్పడే ఆంధప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్ల పాటు ప్రత్యేక ¬దా ఉన్నా.. పన్ను రాయితీలు మాత్రం పదేళ్ల పాటు కొనసాగుతాయని, పోలవరం ప్రాజెక్టు తప్పనిసరిగా వచ్చి తీరుతుందని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన బిల్లులో సీమాంధ్రకు అనుకూలంగా ఉన్న విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సోనియా సూచించారని, సీమాంధ్రకు కేజీ బేసిన్ గ్యాస్ కేటాయింపుపై దృష్టి పెట్టారని, సోనియాతో అనేక అంశాలపై నాయకులు చర్చించారని అన్నారు. రాయలసీమ, కోస్తాంధ్రలో మార్చి నెలాఖరులో బహిరంగ సభలుంటాయని, వాటికి సోనియా, రాహుల్, మన్మోహన్‌లను నాయకులు ఆహ్వానించారని కూడా దిగ్విజయ్ చెప్పారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం మంచి అభివృద్ధి సాధించిందని, దేశంలోనే అగ్రస్థాయి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందని దిగ్విజయ్‌సింగ్ అన్నారు. విభజన అనంతరం రెండు రాష్టాల్రు కూడా మళ్లీ అగ్రస్థానం కోసం పోటీ పడతాయని తాను ఆశిస్తున్నానన్నారు. ఈ రెండు రాష్ట్రాలు ఆరోగ్యకరమైన వాతావరణంలో పోటీ పడతాయని, పరస్పరం సహకరించుకుంటాయని ఆయన అన్నారు. ఇక రాష్ట్రపతి ఆమోదముద్ర, అపాయింటెడ్ డే కోసం తాము ఎదురు చూస్తున్నామని, అవి రాగానే కొత్త రాష్ట్రం ఏర్పాటవుతుందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు.యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలతో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మాట్లాడినప్పుడు కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనంపై సంకేతాలు ఇచ్చారని దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. మీడియా సమావేశంలో పీసీసీ ఛీఫ్ బొత్సా సత్యనారాయణ, కన్నా లక్ష్మీ నారాయణ, రఘువీరారెడ్డి, బాలరాజు, అనం రామనారాయణ రెడ్డి, జేడీ శీలం, డొక్కా మాణిక్య వరప్రసాద్, సి.రామచంద్రయ్య, అహ్మదుల్లా తదితరులు ఉన్నారు.