నేడు రాష్ట్రపతికి తెలంగాణ బిల్లు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు (ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ ముసాయిదా-2014) బుధవారం అర్ధరాత్రి తర్వాత రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంది. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన తెలంగాణ బిల్లును మొదట న్యాయశాఖకు పంపారు. ఆ శాఖ పరిశీలన తర్వాత బిల్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చేరింది. హోం శాఖ బిల్లును మరోసారి క్షుణ్నంగా పరిశీలించిన మీదట రాష్ట్రపతి భవన్‌కు పంపేందుకు ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి ఈ ముసాయిదా త్వరలోనే రాజముద్ర వేయనున్నారు. ఆయన సంతకం చేసిన తర్వాత తెలంగాణ బిల్లు చట్టంగా మారుతుంది. దీంతో దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడుతుంది. రెండు రాష్ట్రాలు అధికారికంగా ఉనికిలోకి వచ్చే రోజు (అపాయింటెడ్ డే) త్వరలోనే నిర్ణయిస్తారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అపాయింటెడ్ డేపై కాస్త ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల వరకూ ఉమ్మడి రాష్ట్రాన్నే కొనసాగించాలని ఎన్నికల అనంతరమే ఇరు రాష్ట్రాలు ఉనికిలోకి వచ్చే అపాయింటెడ్ డే ఉండేలా కేంద్రం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడగానే తెలంగాణ బిల్లుపై గెజిట్ నోటిఫికేషన్ వెలువడుతుంది.