సుపాలనకు సహకరించండి

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం
గవర్నర్‌ నరసింహన్‌
హైదరాబాద్‌, మార్చి 2 (జనంసాక్షి) :
రాష్ట్రంలో సుపరిపాలనకు సహకరించాలని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆదేశాల మేరకు పాలనా బాధ్యతలు స్వీకరిస్తున్నానని గవర్నర్‌ నరసింహన్‌ తెలిపారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యంలో గవర్నర్‌ నరసింహన్‌ రాజ్‌భవన్‌ నుంచి ప్రజలనుద్దేశించి ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. తెలుగులో చదివి అందర్నీ ఆకట్టుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పర్యవేక్షణలో ఆయన సూచనల మేరకు పరిపాలన కొనసాగిస్తా. రాష్ట్రంలోని అధికారులంతా పరిపాలన సవ్యంగా జరిగేలా సహకరించాలి. పరిపాలన సవ్యంగా కొనసాగేలా కృషి చేస్తాను. తెలుగు ప్రజలు వివేకవంతులు.. ఆలోచనా పరులు.. పరిపాలన సక్రమంగా కొనసాగేలా సహకరించాలి. రాష్ట్ర అభివృద్ధిలో పౌరులందరికీ సమాన భాగం ఉంటుంది. రాష్ట్రంలోని అందరికీ సమన్యాయం చేసేందుకు కృషి చేస్తా. శాంతిభద్రతలను పరిరక్షణకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. అభివృద్ధి విషయంలో రాజీపడబోం. పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు అన్ని విధాలా సహకరిస్తాం. సంక్షేమ పథకాలు యథావిధిగా సాగుతాయి. అభివృద్ధిని గణాంకాల పరంగా కాకుండా క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలిస్తాం. సమస్యలుంటే సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకుందాం. ఆంధ్రదేశం స్వర్ణభూమి.. పెట్టుబడులు రావడానికి అందరం కృషి చేయాల్సి ఉంది. విద్యారంగం అభివృద్ధికి కృషి చేస్తా. రాష్ట్ర ప్రజలందరికీ వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటా. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దాల్సి ఉంది. రైతాంగ సమస్యలను కూడా పరిష్కరిస్తా. మీడియాకు కూడా ప్రత్యేక బాధ్యత ఉంది. మీడియా కూడా ఎప్పటికప్పుడు సహకరించాలని సూచించారు.