అకాల వర్షం : భారీ నష్టం

ఆదిలాబాద్‌, మార్చి3 (జనంసాక్షి): జిల్లాలోని ఎనిమిది మండలాల్లో వీచిన గాలుల వల్ల విద్యుత్‌ సరఫారకు తీవ్ర అంతరాయం కలిగింది. అలాగే స్తంభాలు కూలడం లాంటి ఘటనలతో ట్రాన్స్‌కో తీవ్రంగా నష్టపోయింది. పలు గ్రామాల్లో విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయి ఆయా గ్రామాలు అంధకారంలో ఉండిపోయాయి. దీంతో పాటు ఆదిలాబాద్‌, నిర్మల్‌ డివిజన్లకు సరఫరా అయ్యే విద్యుత్తు లైన్‌కు సంబంధించిన 220 కేవీ టవర్లు సైతం పడిపోయాయి. దీంతో రూ.కోటికి పైగా నష్టం వాటిల్లినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. విద్యుత్తు లైన్‌ పునరుద్దరణకు సమయం పట్టే అవకాశం ఉన్నందున కోతలకు అదనంగా విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని వారు తెలిపారు. 118 చిన్న స్తంభాలు మరో 18 పెద్ద స్తంభాలు నేలకొరిగాయి. దీంతో ఆరు ఏడు లక్షల నష్టం జరిగినట్లుగా అధికారులు తెలిపారు. అకాల వర్షం వల్ల వెయ్యి ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా నివేదించారు. గాలుల తీవ్రత, వడగళ్ల వర్షం కొన్ని మండలాలకు , గ్రామాలకే పరిమితం కావడంతో నష్ట శాతం తక్కువగా ఉంది. ప్రస్తుతం పంటలు కోత దశలో ఉన్నాయి. ఈ సమయంలో వడగళ్ల వర్షం కురియడంతో తీవ్రనష్టం జరిగింది. మొక్కజొన్న, గోధుమ, నువ్వులు తదితర పంటలు గాలుల తీవ్రతకు నేలకొరగాయి. వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన శాఖ పరిధిలోకి వచ్చే మిరప, పసుపు తదితర పంటల కోతలు పూర్తి కావడంతో పంట పొలాల్లోనే ఆరబెట్టారు. ఒక్కసారిగా వర్షం కురియడంతో పంటలు మొత్తం వర్షం పాలయ్యాయి. టార్పాలిన్‌ కవర్లు కప్పి పంటను కాపాడుకునే ప్రయత్నం చేసిన గాలుల వల్ల అవి కొట్టుకుపోయాయి. భైంసా, కుంటాల మండలాల్లో తరువాత రోజుల్లో కడెం, ఖానాపూర్‌ మండలాల్లో, ఉట్నూరు, ఇంద్రవెల్లి, జైనూర్‌ లోకేశ్వరం దిలావర్‌పూర్‌ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో వడగళ్ల వర్షం కురిసింది. అధికారుల అంచనా మేరకు దిలావర్‌పూర్‌లో 104 హెక్టార్లు, బదింసాలో 150, కడెంలో 108 హెక్టార్లలో, కుంటాల, ఉట్నూరు, ఖానాపూర్‌ తదితర మండలాల్లో 25 ఎకరాల్లోపు పంటలకు నష్టం జరిగింది. తాండూరు, దహెగాం, కాగజ్‌నగర్‌ మండలాల్లో గాలివాన బీభత్సాన్ని సృష్టించింది. భారీ చెట్లు నేలకొరిగాయి. కరెంటు స్తంబాలు విరిగి ఇళ్లపై పడ్డాయి. 23 కరెంటు స్తంబాలు విరిగిపోగా మండల కేంద్రంలోనే 13 చోట్ల స్తంబాలు విరిగిపోయి తీగలు తెగిపోయాయి. దీంతో మండల కేంద్రం చుట్టుపక్కల గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. తాండూరులో పలుచోట్ల ఇళ్లపైకప్పులు లేచిపోయి బాధితులు రోడ్డున పడ్డారు.తాండూరుఐబీలో పలు దుకాణాల బోర్డులు, ముందు షెడ్లు లేచిపోయాయి. గత రెండుమూడేళ్లలో ఇలాంటి ఇంతటి బలమైన గాలులతో కూడిన వర్షాన్ని ఎన్నడూ చూడలేదని స్థానికులు తెలిపారు.