మహబూబ్‌నగర్ ఎంపీగానే
తెలంగాణ సాధించా
ఆర్డీఎస్‌కు నీళ్లు తెస్తా
ఎట్లియ్యరో చూస్తా : కేసీఆర్
మహబూబ్‌నగర్, మార్చి 6 (జనంసాక్షి) :
మహబూబ్‌నగర్ ఎంపీగానే తెలంగాణ సాధించానని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటి తెలంగాణ ఆకాంక్ష చాటుతానని ఆయన ప్రకటించారు. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు అన్నింటిని మనమే గెల్చుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో గద్వాల్‌లో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సభలోలో ఎంపీలు మందా జగన్నదాధం, కె కేశవరావు, వివేక్ తదితరులు పాల్గొన్నారు. ఈసారి ఎన్నికల్లో గెలిచేది టీఆర్‌ఎస్ పార్టీయే అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ దెబ్బేందో చూపిస్తానని స్పష్టం చేశారు. పాలమూరు జిల్లా పచ్చబడేదాకా కేసీఆర్ నిద్రపోడని పేర్కొన్నారు. పాలమూరులో కృష్ణమ్మ పరవళ్లను ఎవరు ఆపుతారో చూస్తానని హెచ్చరించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు నీటి వాటాలో అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. గద్వాల్‌లో కూడా కృష్ణమోహన్‌రెడ్డిని గెలిపించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పాలమూరు గడ్డ నుంచి అనేక మంది కళాకారుల ఉద్యమాన్ని బలపరిచిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం యావత్ తెలంగాణ సమాజం 14 ఏళ్లు కష్టపడిందని తెలిపారు. కేసీఆర్ మహబూబ్‌నగర్ ఎంపీగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని వెల్లడించారు. గద్వాలలో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ గతంలో ఆర్డీఎస్ ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేసినట్టు వివరించారు. తెలంగాణ ఉద్యమాన్ని అనేకమంది కళాకారులు బలపరిచారని తెలిపారు. జూరాల లింక్ కెనాల్‌ను ఏర్పాటుచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సమైక్యరాష్ట్రంలో పాలమూరుకు అన్యాయం జరిగినా పట్టించుకోలేదని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అన్యాయాలు జరగవన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 14 లక్షల ఎకరాలకు నీరు ఇస్తామని ఆయన తెలిపారు. గద్వాల అసెంబ్లీ సీటుకు తెరాస అభ్యర్థిగా కృష్ణమోహన్‌రెడ్డి పేరు ప్రకటించారు. తెలంగాణలోని వాల్మికీ బోయదొరల్ని ఎస్టీ జాబితాలో చేరుస్తామన్నారు. రెండు నదుల మధ్యలో ఉన్న ప్రాంతంలో కరువు ఉంటుందా? అని ప్రశ్నించారు. పాలమూరులో కరువు లేకుండా చూస్తామన్నారు. పాలమూరు పచ్చబడేదాకా కేసీఆర్ నిద్రపోడని పేర్కొన్నారు. పక్క జిల్లాల నుంచి రైతు కూలీలు వచ్చి వరి పంట కోసేట్టుగా పంటలు పండిద్దామన్నారు. గుర్రంగడ్డ వద్ద మరో బ్యారేజీ కట్టుకుని నీళ్లు పారించు కుందామన్నారు. జూరాల నుంచి మనకు రావాల్సిన నీటి వాటా ఎలా రాదో చూస్తానన్నారు. ఆర్డీఎస్‌ను బద్దలు కొట్టండని బైరెడ్డి పిలుపునిస్తే అడ్డుపడ్డామన్నారు. గద్వాల్‌లో ఫ్యాక్షన్ రాజకీయాలు మారాలని, శాంతి కపోతాలు ఎగరాలని కోరారు. పోరాటం పేదరికం విూద చేయాలి కానీ మనుషుల విూద కాదని తెలిపారు. గట్టు భీముడిని ఎమ్మెల్సీగా చేస్తామని హావిూ ఇచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగుల పాపం చంద్రబాబు నాయుడుదేనని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులుండరని ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని స్పష్టం చేశారు. జూరాల నుంచి ఆర్డీఎస్‌కు నీల్లు మళ్లిస్తానని చంద్రబాబు చెప్పి 12 ఏళ్లయ్యిందని అయినా ఇప్పటికీ నీళ్లిచ్చే దిక్కులేదని విమర్శించారు. ఆర్డీఎస్ కింద కూడా తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్‌నగర్‌కు నీళ్లు ఎట్లా రావో చూస్తానని అన్నారు. కచ్చితంగా నీళ్లు పారిస్తానని హామీ ఇచ్చారు. అటు తుంగభద్ర, ఇటు కష్ణమ్మ… రెండు నదుల మధ్య ప్రాంతం నడిగడ్డ(గద్వాల). రెండు వైపులా నదులున్నా ఈ ప్రాంతం ఎడారిని తలపిస్తుంది. నడిగడ్డ నుంచి భారీ ఎత్తున నేతలు టీఆర్‌ఎస్‌లో చేడంతో ఇవాళ గద్వాల గులాబీమయమైంది. వైఎస్‌ఆర్ పార్టీ నుంచి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మునిసిపల్ ఛైర్మన్ బీఎస్ కేశవ్‌తో పాటు 12 మంది మాజీ కౌన్సిలర్లు, 30 వేల మంది వైసీపీ కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కృష్ణమోహన్‌రెడ్డి గత ఎన్నికలలో స్వల్ప ఓట్ల తేడాతో టీడీపీ నుంచి డీకే ఆరుణపై పోటీ చేసి ఓడిపోయారు. 2009లో డీకే అరుణ గెలుపునకు మూల కారకుడు బక్క చంద్రన్న సైతం ఇవాళ కృష్ణమోహన్‌రెడ్డి వెంట నడుస్తున్నాడు. బక్క చంద్రన్నకు గట్టు, ధరూర్ మండలాలపై పూర్తి పట్టుంది. ఈ ఓట్లతోనే గతంలో కాంగ్రెస్ పార్టీ గద్వాలలో గెలిచింది. ఇప్పడు ఈ రెండు మండలాల ఓట్లు పూర్తిగా టీఆర్‌ఎస్‌కు పడే అవకాశముంది. పంచాయతీ ఎన్నికల్లో 26 మంది సర్పంచులకుగాను కృష్ణమోహన్‌రెడ్డి 12 మందిని గెలిపించుకున్నాడు. టీఆర్‌ఎస్ నడిగడ్డలో పాగావేయడంతో గద్వాల పట్టణ ఓట్లు సైతం టీఆర్‌ఎస్‌కు పడనున్నాయని అంచనా వేస్తున్నారు.