పదవులు ముఖ్యంకాదు
తెలంగాణలో పార్టీ పటిష్టతే ప్రధానం : జానారెడ్డి
న్యూఢిల్లీ, మార్చి 13 (జనంసాక్షి) :
పదవులు ముఖ్యం కాదని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తమ ప్రధాన కర్తవ్యమని సీనియర్ కాంగ్రెస్ కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నారు. గురువారం ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తాము ముందుండి పోరాడమన్నారు. అధిష్ఠానం నిర్ణయాన్ని తప్పుబట్టానని, ఇబ్బంది పెట్టనని జానారెడ్డి పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ పదవికోసం పాకులాడలేదని వివరించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి దక్కకపోవడంతో ఆయన హుటాహుటిని ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ పెద్దలను కలిశారు. తెలంగాణ పిసిసి చీఫ్ పదవి తనకు రాకపోవడంపై జానా అసహనం వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం సోనియా గాంధీ, దిగ్విజయ్ సింగ్ తో బుధవారం భేటీ అయ్యారు. కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీతో ఉదయం భేటీ అయ్యారు. తాను పదవి కోసం ప్రయత్నం చేస్తున్నట్లు వస్తున్నట్లు వార్తలు అసంబద్ధమని కొట్టిపారేశారు. రాష్ట్రంలోని పరిస్థితులను సోనియా, రాహుల్ కు వివరించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముందుండి పోరాడుతానని, తెలంగాణలో పార్టీ ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. అంతేగాకుండా పార్టీ ప్రతిష్టను కాపాడడానికి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా అన్ని విధాలుగా సహకరిస్తానని.. తన జీవితంలో సంతృప్తి, అసంతృప్తికి తేడా లేవని వేదాంత ధోరణిలో జానా చెప్పారు. ఈ సందర్భంగా రెండు ప్రాంతాల పీసీసీ అధ్యక్షులకు జానా అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతంపై రాహుల్‌తో చర్చించినట్లు తెలిపారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, పార్టీని ఇబ్బంది పెట్టనని స్పష్టం చేశారు. తాను ఎన్నడూ పదవుల కోసం పాకులాడలేదన్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే తన కర్తవ్యమని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి జానారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.