రెండు విడతల్లో ఎన్నికల నిర్వహణకు అనుమతించండి
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై సుప్రీంను కోరిన ఈసీ
న్యూఢిల్లీ, మార్చి 14 (ఆర్‌ఎన్‌ఎ) :
రెండు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రయత్నాలకు చుక్కెదురయింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పాత షెడ్యూల్ ప్రకారమే జరిగే అవకాశం కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పరిషత్ ఎన్నికలను ఏప్రిల్ 6, 8 తేదీల్లో నిర్వహించి 11న కౌంటింగ్ జరుపుతామని రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం సుప్రీంకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ ఢిల్లీకి చేరుకొని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ విచారణకు రాలేదు. శుక్రవారం నుంచి 23 వరకు కోర్టుకు ¬లీ పండుగ సెలవులున్నాయి. 24న పరిషత్ ఎన్నికల కేసు పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆలోగా నామినేషన్ల పక్రియ పూర్తి కానుంది. ఎన్నికల వాయిదాకు అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. ఆంధప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఏప్రిల్ 6, 8 తేదీల్లో రెండు దఫాలుగా ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ సుప్రీం కోర్టుకు లిఖితపూర్వకంగా తెలిపింది. అయితే కోర్టులో పిటిషన్ విచారణకు రాకపోవడంతో ఈనెల 17వ తేదీ నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు నామినేషన్లు స్వీకరిస్తారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇచ్చే వరకు స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రస్తుత నోటిఫికేషన్ ఆధారంగానే ప్రక్రియ కొనసాగుతుంది.