నిర్భయ కేసులో సుప్రీం స్టే
న్యూఢిల్లీ, మార్చి 15 (జనంసాక్షి) :
దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నిందితులు ముఖేష్, పవన్‌లకు సుప్రీంకోర్టులో కొంత ఊరట లభించింది. వారికి ఢిల్లీ హైకోర్టు ఖరారు చేసిన ఉరిశిక్షను నిలిపివేస్తూ సుప్రీం కోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. మార్చి 31 వరకు శిక్షను నిలిపివేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరికి ఉరిశిక్షను ఖరారు చేస్తూ ఇటీవలే హైకోర్టు నిర్ధారించారు. 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో జరిగిన వైద్యవిద్యార్థిని సామూహిక అత్యాచారం, హత్య కేసులను విచారించిన ట్రయల్‌కోర్టు నిందితులు నలుగురికి మరణశిక్ష విధించింది. దీనిపై వారు ఢిల్లీ హైకోర్టుకు అప్పీలు చేసుకోగా హైకోర్టు సైతం వారి శిక్షను సమర్థించింది. అయితే పవన్, ముఖేశ్ అనే ఇద్దరు నిందితులు తిరిగి సుప్రీంకోర్టుకు వెళ్లారు. మరో ఇద్దరు నిందితుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోగా, ఒకరు బాలనేరస్తుడన్న సంగతి తెలిసిందే.