మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం


హైదరాబాద్‌, మార్చి 28 (జనంసాక్షి) :
ఆకుపచ్చని భారత దేశాన్ని నిర్మించాలని, పచ్చదనమే దేశానికి చిరునామా కావాలని మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని ఆయన సూచించారు. పర్యావరణ సమతౌల్యత దెబ్బతినడంతో అనేక ముప్పులు, సవాళ్లను ఎదుర్కొంటున్నామని అన్నారు. పచ్చదనం, పరిశుభ్రతలో మనం వెనకబడి ఉంటే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంత అభివృద్ధి సాధించినా అది వృధాయేనని అన్నారు. పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యకారకాలు శుద్ధి చేసేందుకు ఉద్దేశించిన వ్యవస్థలు సరిగా అమలు కావడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మనకెందుకులే అన్న ధోరణఱి సరికాదన్నారు. జీడిమెట్ల మురుగునీటి శుద్ధి కేంద్రం ప్రారంభించి 25 ఏళ్లు అయిన సందర్భంగా హైదరాబాదులో ఏర్పాటుచేసిన జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సదస్సులో అబ్దుల్‌ కలాంతో పాటు ఆ సంస్థ ఛైర్మన్‌ జీకేబీ చౌదరి, సదస్సు నిర్వహణ చైర్మన్‌ జీఎస్‌ మర్దా, ఐఈఏ మాజీ అధ్యక్షులు యోగిన్‌, ఎన్‌ఈఈఆర్‌ఐ డైరెక్టర్‌ సతీష్‌ ఆర్‌ వాటే
తదితరులు పాల్గొన్నారు. 2020 నాటికి భారత దేశాన్ని పచ్చదనం, పరిశుభ్రతకు చిరునామాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని మాజీ రాష్ట్రపతి పిలుపునిచ్చారు. ఇందుకు చిన్నప్పటి నుంచే పర్యావరణాన్ని కాపాడే అలవాట్లు చేసుకోవానల్నారు. మన ఇంటినుంచే పచ్చదనం, పరిశుభ్రతలను పాటిస్తే సమాజం పరిశుభ్రంగా తయారవుతుందన్నారు. పర్యావరణ అన్నది మన జీవితంలో భాస్వామ్యం కావాలన్నారు. తమిళనాడు, పంజాబ్‌ రాష్ట్రాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఎంతో చక్కగా పనిచేస్తున్నాయని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ సోలి జె. ఆర్చివాలా రచించిన గ్రీన్‌ టెక్నాలజీస్‌ అనే పుస్తకాన్ని కలాంకు అంకితమిచ్చారు. ఈ సదస్సుకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.