తెరాస గెలిస్తే దొరల రాజ్యం
జేఏసీ ప్రశ్నలకు జవాబు చెప్పండి
అమరవీరుల కుటుంబాలకు పెద్దపీట : పొన్నాల
హైదరాబాద్, మార్చి 30 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపిస్తే దొరల రాజ్యమే వస్తుందని టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పునరుద్ఘాటించారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాటలను, ఆటలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తగిన రీతిలో బుద్ధిచెప్పి తీరుతారని అన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ అభివృద్ధి అంశాలపై ఒక్క ప్రతిపాదనైనా చేసిందా అని ప్రశ్నించారు. తెలంగాణ తనవల్లే వచ్చిందంటూ కేసీఆర్ ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ వైఖరి నచ్చకే టీఆర్‌ఎస్, జేఏసీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. సామాజిక తెలంగాణ నిర్మించడమే తమ అభిమతమని పొన్నాల అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే భయం కేసీఆర్‌కు పట్టుకుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్నే అనేక కష్టనష్టాలకు ఓర్చి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇక్కడి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. టీ జేఏసీ అడిగిన ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పాలని టీఆర్‌ఎస్‌కు పొన్నాల సూచించారు. ఎన్నికల్లో పొత్తులపై సీపీఐతో చర్చలు ముగిశాయని, హైకమాండ్ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. తెలంగాణ ప్రాంత రైతాంగానికి వ్యవయాసానికి ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేయాలని, అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని గవర్నర్‌కు వినతిపత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు. తాము అమరవీరులకు కుటుంబాలకు పెద్దపీట వేసి వారిని గౌరవించుకుంటామని అన్నారు.