చంద్రబాబు ఆంధ్రోడే
తెలుగుదేశం సమైక్య పార్టే
తెలంగాణను అడ్డుకోలేదని ఏడు కొండలపై ఇమానం చేస్తవా?
బాబుపై హరీశ్ ఆర్‌పార్
హైదరాబాద్, ఏప్రిల్ 3 (జనంసాక్షి) :టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునా యుడు ఎప్పటికీ ఆంధ్రోడేనని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తేల్చిచెప్పారు. తెలుగుదేశం పార్టీ సమైక్య పార్టీయేనని ఆయన అన్నారు. తెలంగాణను అడ్డు కోలేదని ఏడుకొండల ఎంకన్న, కాణిపాకం వినాయకుడి మీద ఇమానం చేస్తావా అని చంద్రబాబును ప్రశ్నించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునా యుడు ఎప్పటికీ తెలంగాణ ద్రోహేనని హరీశ్‌రావు తేల్చిచెప్పారు. వరంగల్ ప్రజాగర్జన సభలో చంద్రబాబు ప్రసంగమంతా అబద్దాల పుట్ట అని ఆయన విరుచుకపడ్డారు. తెలంగాణకు చివరి వరకు వ్యతిరేకంగా పనిచేసి ఇప్పుడు తాను తెలంగాణకు అడ్డుపడలేదని చెప్పినంత మాత్రాన తెలంగాణ ప్రజలు చంద్రబాబును నమ్మబోరని అన్నారు. చంద్రబాబు
కారణంగానే తెలంగాణ ఆలస్యం కావడమే గాకుండా 1200 మంది యువకుల ఆత్మబలిదానాలకు చంద్రబాబే కారణమని ఆయన ఆరోపించారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటనను చంద్రబాబు అడ్డుకోకుండా ఉంటే ఆత్మబలిదానాలు జరిగి ఉండేవి కావన్నారు. చివరి వరకు తెలంగాణను అడ్డుకుని ఇవాళ తాను తెలంగాణకు ఏనాడు అడ్డుకోలేదని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని బాబుపై మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదవి కోసం మామ మీద చెప్పులేసిన ఘనత బాబుదేనని.. ఊకదంపుడు ఉపన్యాసాలతో మోసం చేస్తే నమ్మే పరిస్థితిలో జనం లేరని విమర్శించారు. ఎన్టీఆర్ అల్లుడు కాకుంటే బాబును దేఖేదెవరని అన్నారు. మామకు, తోడల్లుడు దగ్గుబాటికి, హరికృష్ణకు వెన్నుపోటు పొడిచిన ఘనుడు బాబు అని ఫైరయ్యారు. తెలంగాణాలో టీడీపీ ఖాళీ అయ్యిందన్నారు. ఇక దానికి మనుగడ లేదన్నారు. టీఆర్‌ఎస్ వద్దనుకున్న వారే టీడీపీలో మిగిలారే తప్ప టీడీపీ ఏనాడో ఖాళీ అయ్యేదన్నారు. ఇక్కడ దుకాణం మూసుకోక తప్పదన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో వచ్చినప్పుడు తమిళనాడు నుంచి పంజాబ్ వరకు బెంగాల్ నుంచి మహారాష్ట్ర వరకు విమానం ఎక్కి ఆపేందుకు ప్రయత్నించింది నిజం కాదా అని ప్రశ్నించారు. కాళ్లు పట్టుకోవడమే తప్ప అన్ని ప్రయత్నాలు చేసి తెలంగాణ బిల్లును అడ్డుకున్నారని అన్నారు. తెలంగాణ టిడిపి నేతలైనా మా బాబు తెలంగాణకు వ్యతిరేకంగా పని చేయలేదని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు. ఇక కటుఉంబ పాలన గురించి చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. కుటుంబ పాలన ముమ్మాటికీ టీడీపీదేనన్నారు. ఎన్టీఆర్‌ను అడ్డుకుపెట్టుకుని చంద్రబాబు, హరికృష్ణ, బాలకృష్ణ, దగ్గుబాటి, పురంధేశ్వరి, లోకేశ్ ఇలా అందరూ వచ్చిన వారేనని అన్నారు. కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులంతా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, పోరాడి, జైలుకెళ్లిన వారన్నారు. ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన ఆనేక సంక్షేమ పథకాలను తుంగలోకి తొక్కిన చంద్రబాబు తాను రైతులకు మేలు చేస్తానని ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. ఎన్టీఆర్ రూ.50 లకే రైతులకు కరెంటు సరఫరా చేస్తే దానిని రద్దుచేసిన ఘనత బాబుకే దక్కుతుందన్నారు. బాబు హయాంలో తెలంగాణలో 9 ఏళ్ల పాలనలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాలనైనా మంజూరు చేశారా? అని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేదని, తాను అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీసానన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇబ్బడి ముబ్బడిగా కాలేజీలు ఉన్నా ఇక్కడ మాత్రం ఊఏవిూ లేవన్నారు. ఇదేనా వీరి అభివృద్ది అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు అల్లుడు కాకపోతే నిన్ను చూసే నాథుడే లేడని.. తెలంగాణ ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించింది నీవు కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణపై మాట మార్చినందుకే వెయ్యి మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అమరవీరుల గురించి మాట్లాడటం చూస్తే వంద ఎలుకలు తిన్న పిల్లి శాంతి కోసం ప్రార్థించినట్లుందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో బిల్లు పాస్ కాకుండా దేశమంతటా కాలు కాలిన పిల్లిలా తిరిగింది ఎవరూ? చంద్రబాబు తెలంగాణను అడ్డుకునేందుకు కాళ్లు పట్టుకోవడం ఒకటే తక్కువైందని ఆరోపించారు. తెలంగాణను అడ్డుకోలేదని వెంకటేశ్వర స్వామి విూద ప్రమాణం చేస్తావా? అని ఘాటుగా విమర్శలు సంధించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకుండా అడ్డుకునేందుకు యత్నించిన చంద్రబాబు తెలంగాణ అమర వీరులు గురించి మాట్లాడడం సిగ్గూచేటుగా ఉందని విమర్శించారు. ఒక్కనాడైనా వారి కుటుంబాలను పరామర్శించావా అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటును చంద్రబాబు తన రెండు కళ్ల సిద్ధాంతంతో తప్పించుకున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కంటే అధిక సీట్లు గెలవకుంటే రాజకీయ సన్యాసం చేస్తావా అంటూ హారీష్ రావు ఈ సందర్బంగా చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఎన్నికలో గెలవలేక బీజేపీతో పొత్తు కోసం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ముందు మోకరిల్లారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో చంద్రబాబు ఫోటో పెట్టుకునేందుకు క్యాడర్ భయపడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అల్లుడు కాకుంటే ఆయన్ని పట్టించుకునే నాథుడు కూడా ఉండేవాడు కాదంటూ విమర్శించారు. మోడీని విమర్శించిన బాబు ఇప్పుడు మోడీ ప్రాపకం కోసం తాపత్రయపడడం లేదా అని అన్నారు.