సోనియా కృషి వల్లే తెలంగాణ

కాంగ్రెస్‌కు డీఎస్‌ మద్దతు కోరాడు
జేఏసీ స్టీరింగ్‌ కమిటీలో చర్చిస్తాం : కోదండరామ్‌
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కృషి వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. శుక్రవారం ఆయన టీ జేఏసీ నేతలతో కలిసి పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతివ్వాలంటూ డీఎస్‌ తమను కోరారని కోదండరామ్‌ వెల్లడించారు. చర్చల్లో తెలంగాణ పునర్నిర్మాణం, ఇంతవరకు అధికారానికి దూరంగా ఉన్న వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించడం, సామాజిక న్యాయం, ఉద్యోగుల సమస్యలు, ఇతర కీలక అంశాలపై చర్చించినట్లుగా సమాచారం. భేటీ అనంతరం కోదండరామ్‌ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటు కోసం సోనియాగాంధీ ఎన్నో అడ్డంకులు ఎదురైనా లెక్క చేయలేదని కితాబిచ్చారు. తమ పార్టీకి టీ జేఏసీ మద్దతివ్వాలంటూ చేసిన ప్రతిపాదనను స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా డి. శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన జేఏసీని తాము మద్దతు కోరామన్నారు. తెలంగాణ అభివృద్ధిలోనూ జేఏసీ ముఖ్య పాత్ర పోషించాలని కోరుతున్నట్లు తెలిపారు. తెలంగాణ సాధనే లక్ష్యమన్న కేసీఆర్‌.. తెలంగాణ వచ్చిన తర్వాత అనుసరిస్తున్న విధానాలు విఫలమవుతాయన్నారు.