జాడ తెలియని మలేషియా విమానం


నేటితో బ్లాక్‌బాక్స్‌ బ్యాటరీ డిశ్చార్జి
ఆందోళనలో ప్రయాణికుల బంధువులు
కౌలాలంపూర్‌, ఏప్రిల్‌ 5 (జనంసాక్షి) :
ప్రయాణికులతో సహా అదృశ్యమైన మలేషియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం బ్లాక్‌బాక్స్‌ బ్యాటరీ ఆదివారంతో డిశ్చార్జి కానుంది. మార్చి 8న కౌలాలంపూర్‌ విమానాశ్రయం నుంచి 238 మందితో చైనా రాజధాని బీజింగ్‌కు బయల్దేరిన ఎంహెచ్‌-370 విమానం కనిపించకుండా పోయింది. ఆ విమానం మార్చి 9వ తేదీ ఉదయం బీజింగ్‌కు చేరుకోవాల్సి ఉండగా ఇంతవరకూ దాని జాడతెలియరాలేదు. విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలిపోయినట్లుగా మలేషియా ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు విమాన శకలాలను పోలిన కొన్ని వస్తువులు హిందూ మహాసముద్రంలో తేలియాడుతున్నట్లు ఆస్ట్రేలియా, చైనా తదితర దేశాల ఉపగ్రహాలు ఛాయచిత్రాలను విడుదల చేశాయి. కానీ ఇంతవరకూ విమానం తాలుఖూ శకలాలేవి లభ్యం కాలేదు. విమానం మొదట్లో హైజాక్‌ అయినట్లు వార్తలొచ్చాయి. కుట్ర కోణంలోనూ దర్యాప్తు సాగించారు. చివరికి ప్రమాదంగా నిర్దారణకు వచ్చారు. అయితే విమాన ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఉన్న ఏకైక అవకాశం బ్లాక్‌బాక్స్‌. విమాన శకలాలను గుర్తించిన నాటి నుంచి బ్లాక్‌బాక్స్‌ కోసం అన్వేషణ సాగిస్తున్నా ఇంతవరకూ ఆచూకీ చిక్కలేదు. అయితే బ్లాక్‌బాక్స్‌ కాలపరిమితి 30 రోజులే కావడం, ఆ గడువు సోమవారంతో తీరనుండటంతో విమాన ప్రమాదం మిస్టరీగానే మిగిలిపోనుందా అనే సందేహం ప్రతి ఒక్కరి మదిని తొలుస్తోంది. బ్లాక్‌బాక్స్‌ను ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియన్‌ నౌక ఓషన్‌ షీల్డ్‌ తీవ్ర అన్వేషణ సాగిస్తోంది. ఈ నౌకకు బ్లాక్‌బాక్స్‌ను డిటెక్ట్‌ చేసే డిటెక్టర్‌ను అమర్చారు. మరోవైపు బ్లాక్‌ పడిన చోటు సముద్రం లోతు, ఉష్ణోగ్రత, ఒత్తిడి తదితర అంశాలు బ్లాక్‌బాక్స్‌ శక్తిని ప్రభావితం చేసే అవకాశముందని ఆస్ట్రేలియా రక్షణ మంత్రి డేవిడ్‌ జాన్‌స్టన్‌. అయితే మరో వారం రోజుల పాటు బ్లాక్‌బాక్స్‌ డిశ్చార్జి అయ్యే అవకాశముందని ఆస్ట్రేలియా అధికారులు తెలిపారు. ఆలోపున కూడా బ్లాక్‌బాక్స్‌ను కనుగొనడం గట్టి సవాలేనని వారు పేర్కొన్నారు.