మతతత్వ శక్తులను ఓడించండి


సెక్యులర్‌ ఓట్లలో చీలికవద్దు

2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని సయ్యద్‌ బుకారీ పిలుపు
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 6 (జనంసాక్షి) :దేశంలో విచ్ఛిన్న రాజకీయాలను ప్రేరేపించాలని చూస్తున్న మతతత్వ శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ జామా మజీద్‌ షాహీ ఇమామ్‌ సయ్యద్‌ అహ్మద్‌ బుకారీ పిలుపునిచ్చారు. సయ్యద్‌ ఇమామ్‌ అహ్మద్‌ బుకారీ దేశంలోని ముస్లిం స మాజామంతా కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని బహిరంగ మద్దతు ప్రకటించారు. దేశానికి మతతత్వమే పెద్ద ప్రమాదమని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే టెన్‌ జన్‌పథ్‌లో సోనియాగాంధీతో జరిగిన చర్చల్లో ముస్లింలకు చెందిన అనేక డిమాండ్లను ఆమె ముందుంచారు. సచార్‌ కమిటీ రిపోర్టును యథాతథంగా అమలు చేయాలన్నారు. లౌకికవాద ఓట్లలో చీలికరాకుండా ఉండేందుకు తామీ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన వెల్లడించారు. మతతత్వ శక్తులను ఓడించే వారి వెంట తాముంటామన్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సవాల్‌ మతతత్వమేనని ఆయన ఉద్ఘాటించారు. అవినీతికన్నా మతతత్వమే ప్రమాదకరమన్నారు. దేశ ప్రజల మధ్య విభజన తీసుకువచ్చేందుకు భారతీయ జనతా పార్టీ కృషి చేస్తోందని దేశంలోని సెక్యులర్‌ శక్తులంతా ఒక్కతాటిపైకి వచ్చి దీనిని తిప్పికొట్టాలని అన్నారు. ఈ మద్దతు 2014 సార్వత్రిక ఎన్నికల వరకేనన్నారు. అలాగే పశ్చిమబెంగాల్‌లోని తృణమూల్‌ కాంగ్రెస్‌కు, బీహార్‌లోని ఆర్జీడీ పార్టీలకు తన మద్దతు ప్రకటించారు.