తెరాస మూడో జాబితా
మెదక్ నుంచి కేసీఆర్
నిజామాబాద్ లోక్‌సభ కవితకు
పెద్దపల్లి నుంచి బాల్క సుమన్
కండువా మార్చిన నోముల, మైనంపల్లి
హైదరాబాద్, ఏప్రిల్ 8 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర సమితి లోక్‌సభ, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను వెల్లడించింది. టీఆర్‌ఎస్ తరపున ఇప్పటికే అసెంబ్లీ నుంచి పోటీకి దిగిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇక మెదక్ నుంచి లోక్‌సభకు పోటీచేయనున్నారు. ఆయన తనయ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిజామాబాద్ లోక్‌సభ బరిలో దిగనున్నారు. ఈ మేరకు పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను మంగళవారం కేసీఆర్ విడుదల చేశారు. ఉదయమే పార్టీలో చేరిన సిపిఎం నాయకుడు నోముల నర్సింహయ్యకు నాగార్జునసాగర్ టిక్కెట్ కేటాయించారు. అలాగే వైరా సిపిఐ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రావతి టిఆర్‌ఎస్‌లో చేరడంతో ఆమెకు తిరిగి వైరా నుంచి పోటీకి రంగంలో దింపారు. టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్‌ను పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దింపారు. ఇక్కడ ఆయన వివేక్‌ను ఢీకొనబోతున్నారు. మొత్తం 8 లోక్‌సభ, 28 శాసనసభ స్థానాల అభ్యర్థులను టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. గత ఎన్నికల్లో మహబూబ్‌గర్ నుంచి గెలిచిన కేసీఆర్ ఈసారి మెదక్ నుంచి బరిలో దిగనున్నారు. కేసీఆర్ కుమార్తె, జానజాగృతి అధ్యక్షురాలు కవిత నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. టీఆర్‌ఎస్ మూడు విడతల్లో మొత్తం 17 లోక్ సభ, 96శాసన సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తాజా జాబితాలో విద్యార్థి నాయకుడు బాల్కా సుమన్, సీపీఐ తాజా మాజీ ఎమ్మెల్యే చంద్రావతికి చోటు దక్కింది. ఇక హైదరాబాద్ టిడిపి మాజీ అధ్యక్షుడు ముఠాగోపాల్ టిఆర్‌ఎస్‌లో చేరడమే గాకుండా ముషీరాబాద్ టిక్కెట్ సాధించారు. ఎన్నో ఏళ్లుగా ఆయన టిడిపిలో ఉన్నా టిక్కెట్ రాని గోపాల్‌కు తొలిసారి అసెంబ్లీ బరిలో దిగుతున్నారు. అయితే ఇక్కడ గతంలో పోటీ చేసిన సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డికి మొండిచేయి చూపారు. ఇక ఆదిలాబాద్ స్థానంలో జి.నగేశ్ ఎంపీగా పోటీ చేయనున్నారు. ఇక ఎంపీ స్ధానాల్లో మహబూబాబాద్ – సీతారాం నాయక్, ఖమ్మం – బేగ్ షేక్, హైదరాబాద్ – రషీద్ షరీఫ్ పేర్లు చోటుచేసుకున్నాయి. అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఈ విధంగా ఉంది. ఉప్పల్ – సుభాష్ రెడ్డి, చార్మినార్ – ఇనాయత్ అలీ బాక్రీ, మలక్‌పేట్ – సతీష్ యాదవ్, చాంద్రాయణగుట్ట – సీతారాం రెడ్డి, ఖైరతాబాద్ – ఎం. గోవర్ధన్‌రెడ్డి, అంబర్‌పేట్ – సుధాకర్‌రెడ్డి, కార్వాన్ – ఠాకూర్ జీవన్‌సింగ్, ఖమ్మం – జి.కృష్ణ, పినపాక – డా. శంకర్‌నాయక్, మధిర – బొమ్మెర రామ్మూర్తి, వైరా – చంద్రవతి, కుత్బుల్లాపూర్ – కొలను హన్మంతరెడ్డి, సనత్‌నగర్ – విఠల్, మంచిర్యాల – దివాకర్‌రావు, నిజామాబాద్ అర్బన్ – గణెళిష్ గుప్త, నారాయణ ఖేడ్ – భూపాల్‌రెడ్డి, కూకట్‌పల్లి – గొట్టిముక్కల పద్మారావు, కొడంగల్ – గుర్నాథరెడ్డి, మహేశ్వరం – కొత్త మనోహర్‌రెడ్డి, గోషామహల్ – ప్రేమ్ కుమార్, యాకత్‌పుర – ఎం.డి.షబ్బీర్ అలీ, ఎల్బీనగర్ – రామ్మోహన్ గౌడ్, అశ్వారావుపేట – జయ ఆదినారాయణ ఉన్నారు. పరకాలలో భిక్షపతికి టిక్కెట్ దక్కలేదు. సీపీఎం శాసనసభ పక్ష మాజీ నేత నోముల నర్సింహయ్య, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంగళవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణకు కాంగ్రెస్, టీడీపీలే ద్రోహం చేశాయని టీఆర్‌ఎస్ నేత నోముల నర్సింహయ్య ధ్వజమెత్తారు. సిపిఎం ఫ్లోర్ లీడర్‌గా పనిచేసిన ఆయన మంగళవారం ఉదయం టిఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీలను పాతర పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దొర పెత్తందారి విధానానికి వ్యతిరేకంగానే జానారెడ్డిపై పోటీ చేస్తున్నానని తెలిపారు. తెలంగాణ కోసం అసెంబ్లీలో పోడియం వద్దకు వెళ్తే తనపై సీపీఎం చర్యలు తీసుకున్నదని గుర్తు చేశారు.పార్టీలో చేరిన వెంటనే ఆయనకు సాగర్ టిక్కెట్ కేటాయించారు. దీంతో ఇక ఆయన జానారెడ్డిపై పోటీచేయబోతున్నారు.