వడోదర(గుజరాత్), : తాను వివాహితుడినని బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడి అధికారికంగా పేర్కొన్నారు. బుధవారం వడోదర పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన మోడి తనకు వివాహమైందని, తన భార్య పేరు జశోదాబెన్ అని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్‌లో మొట్టమొదటిసారిగా తాను వివాహితుడినని మోడి పేర్కొనడం విశేషం. ఇప్పటివరకు పోటీ చేసిన అన్ని ఎన్నికల్లో ‘‘భార్య పేరు’’ అన్న కాలమ్‌ను ఆయన ఏమీ రాయకుండా ఖాళీగా వదిలిపెట్టేవారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన తన భార్య పేరును పేర్కొనలేదు.అయితే, 2014 లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన అఫిడవిట్‌లో తన భార్య పేరున్న ఆస్తుల వివరాలు తెలియచేసే కాలమ్‌లో ఆ వివరాలు తనకు తెలియవని ఆయన పేర్కొన్నారు.బుధవారం ఉదయమే మోడి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసినప్పటికీ వడోదర జిల్లా ఎన్నికల అధికారి మాత్రం మోడి అఫిడవిట్‌ను బుధవారం అర్థరాత్రి కలెక్టరేట్‌లో డిస్‌ప్లే బోర్డులో ఉంచారు. కాగా, గత రాత్రి వరకు గుజరాత్ ఎన్నికల సంఘం ఈ అఫిడవిట్‌ను తన అధికారిక వెబ్ సైట్‌లో అప్ లోడ్ చేయలేదు.కాగా, లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలు దాఖలు చేసేటప్పుడు మోడి తన వైవాహిక హోదా గురించి వెల్లడించాలని గతంలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది.