విజయరాణిని రహస్యప్రదేశంలో విచారిస్తున్న సీసీఎస్ పోలీసులు

(జ‌నంసాక్షి) : చిట్టీల రాణి చేతులెత్తేసింది. సినీ, టీవీ నటులకు పది కోట్ల రూపాయల మేరకు టోకరా పెట్టి బెంగళూరు చెక్కేసిన టీవీ ఆర్టిస్టు బత్తుల విజయరాణి(46) తన దగ్గర చిల్లిగవ్వ లేదని చేతులెత్తేసింది.రహస్యప్రదేశంలో విచారిస్తున్న సీసీఎస్ పోలీసులకు షాకులిస్తోంది.అధికవడ్డీల పేరిట పెద్దఎత్తున డబ్బు వసూలు చేసి పారిపోయిందని బాధితులు చెబుతుండగా… తానెవరికీ బాకీలేనని, అసలు కంటే వడ్డీలే ఎక్కువ కట్టానని, అప్పులపాలైపోవడంతో పారిపోయానని చెబుతోంది. 

దీంతో ఇంత వరకు రహస్య విచారణ చేసిన పోలీసులు ఇక బహిరంగ విచారణకు సిద్ధమవుతున్నారు. బాధితులతోముఖాముఖి విచారణకు రంగం సిద్ధం చేస్తున్నారు. విజయరాణికి ఎవరెవరు ఎంతెంత డబ్బు ఇచ్చారు, ఆమె వద్ద ఎవరెవరు చిట్టీలు ఎత్తుకున్నారు?, ఇంకా చిట్టీలు ఎత్తుకోని వారు ఎంతమంది?, వారెవరు? అనే విషయాలను పోలీసులు సేకరిస్తున్నారు. బాధితుల ఎదురుగా ఆమెను ప్రశ్నిస్తే కొంత సమాచారం రాబట్టవచ్చని పోలీసుల ఆలోచన.
ఆమెకు హైదరాబాదులో రెండు ఇళ్లు, గుడివాడలో ఒక ఇళ్లు ఉండగా, ప్లాన్ ప్రకారం ఆమె వాటిని అమ్మేసింది. దీంతో ఇళ్లు కొనుక్కున్న వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇళ్లు నగదుకే అమ్మేసిందా? లేక గతంలో ఇచ్చిన అప్పుపై వాటిని కబ్జా చేశారా? అనే విషయాలను ఆరాతీస్తున్నారు. ఆమె విక్రయించిన మూడు ఇళ్లను పోలీసులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమెకు సహకరించిన మరో 11 మందిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.