భార్య విషయం ఎందుకు దాచావ్‌?


ఇన్నాళ్లు తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చావ్‌ : రాహుల్‌
దోడా, ఏప్రిల్‌ 11 (జనంసాక్షి) :
ఇన్నాళ్లు భార్య విషయాన్ని ఎందుకు దాచిపెట్టావని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్‌ సీఎం నరేం ద్ర మోడీని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాం ధీ సూటిగా ప్రశ్నించారు. ఇంతకాలం
తప్పుడు సమాచారంతో ప్రజలను ఎందుకు మభ్య పెట్టాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. శుక్రవారం జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళల భద్రత గురించి భారీ ఉపన్యాసాలిస్తున నరేంద్రమోడీ, బీజేపీ ఇంతకాలం తప్పుడు సమాచారంతో ఎలా మభ్యపెట్టారని ప్రశ్నించారు. నరేంద్రమోడీ మొదటి సారిగా తాను వివాహితుడినని వెళ్లడించారని, భార్యను పుట్టింటికి పంపేసిన మోడీకి మహిళల గురించి, వారి గౌరవం గురించి మాట్లాడే అర్హతలేదంటూ ధ్వజమెత్తారు. మహిళలపై నిఘా పెడతారు.. వారిని అవమానిస్తారు.. ఇది బీజేపీ నిజస్వరూపమంటూ గుజరాత్‌లో ఒక మహిళలపై స్నూప్‌గేట్‌ వివాదాన్ని ప్రస్తావించారు. ఇలాంటి పార్టీ మహిళా సాధికారిత గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. కర్ణాటకలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకంగా అసెంబ్లీలో అశ్లీల చిత్రాలు చూసిన అంశాన్ని ప్రస్తావిస్తూ వారికి చట్టసభలు, మహిళల పట్ల ఉన్న గౌరవం ఇద్దంటూ ఎద్దేవా చేశారు. దోడా నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాగా మోడీ వివాహ విషయంపై ఇన్నాళ్లు తప్పుడు సమాచారం ఇచ్చిన విషయంపై పరిశీలించాలంటూ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్‌ తరపున కేంద్ర మంత్రి కపిల్‌ సిబల్‌ ఈసీకి ఫిర్యాదు చేశారు. మోడీ 2012 వరకు తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.