వార్తల్లోకెక్కిన యశోదా బెన్‌


మోడీకి వ్యతిరేకంగా మాట్లాడని బెన్‌
జాతీయ మీడియా మోడీ సతీమణి ఇంటి ముందు పడిగాపులు
గాంధీనగర్‌, ఏప్రిల్‌ 11 (జనంసాక్షి) :యశోదా బెన్‌, నిన్నటి వరకు ఈమె ఎవరో ఎవరికీ తెలియదు. ఓ సాధారణ టీచర్‌, కుగ్రామంలో జీవనం.. ఈమె గురించి సమీపంలో నివ సించే వారికి సైతం పూర్తి వివరాలు తెలియవు. బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ తన ఎన్నికల అఫిడవిట్‌లో తన కు వివాహమైందని, తన భార్య పేరు యశోదా బెన్‌గా అని పేర్కొనడంతో ఇప్పుడు అందరి దృష్టికి ఆమెవైపు మళ్లింది. ఆమె ఎవరో ఎలా ఉంటారో ఏం చెప్తారో
తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు తహతహలాడుతున్నారు. సాధారణ ప్రజలకే ఇంత ఉత్సుకత ఉంటే ఇక మీడియా పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆమె కోసం జాతీయ మీడియా అంతా ఆమె ఇంటి ముందు పడిగాపులు కాస్తోంది. గుజరాత్‌లోని కుగ్రామంలో జీవనం సాగిస్తున్న ఆమె కోసం ఇప్పుడు మీడియా చానెళ్లు, పత్రికా ప్రతినిధులు కాళ్లకు బట్టట్టకుండా తిరుగుతున్నారు. రెండు నెలల క్రితం ఓ జాతీయ మీడియాతో ఆమె మాట్లాడారు. మోడీ ప్రసంగాలు టీవీలో వింటుటానని తెలిపారు. మోడీ విజయం సాధించాలని వ్రతాలు కూడా చేస్తుంటానని చెప్పారు. మోడీ కోసం చెప్పులు కూడా వేసుకోనని ఒట్టు పెట్టుకున్నట్లు చెప్పారు. రోజంతా భజనలు, కీర్తనలతో కాలం గడుపుతానని పేర్కొన్నారు. పెళ్లయ్యేనాటికి తన వయసు 17 సంవత్సరాలు కాగా మోడీకి 19 ఏళ్లని చెప్పింది. మూడేళ్లు తాము భార్యాభర్తలుగా ఉన్నామని, అందులో మూడు నెలలు మాత్రమే కలిసి ఉన్నామని చెప్పారు. మోడీ అప్పటల్లో నిరంతరం ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలో ఉండేవారని, ఇంట్లో ఉన్నంత సేపు ఏదో ఒకటి చదువుతూ ఉండేవారని చెప్పారు. తాము ఒకరినొకరు ఏమీ అనుకోలేదని చెప్పారు. విడిపోయి ఇన్నేళ్లయినా మళ్లీ కలుసుకోలేదని, అందుకోసం ప్రయత్నించలేదని కూడా చెప్పారు. ఎప్పుడూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకోలేదని అన్నారు.