కేసీఆర్‌ తెలంగాణ


ఉద్యమ ద్రోహి : పొన్నాల
కరీంనగర్‌ సిటీ, ఏప్రిల్‌ 13 (జనంసాక్షి) :కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమ ద్రోహి అని తెలంగాణ ప్రదేశ్‌ కాం గ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. కరీంనగర్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో ఈనెెల 16న నిర్వహించ తలపెట్టిన సోనియా మహాసభ ఏర్పాట్లను ఆదివారం ఆయన పర్యవేక్షించారు. ఈ సం దర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో సకలజనుల సందర్భంగా కేసీఆర్‌
ఫాంహౌస్‌లో ఉన్నది వాస్తవం కాదా అన్నారు. ఉద్యమానికి ద్రోహం చేసిన వారిని, అణచివేసిన వారిని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా 19 మందిని అరువుగా తీసుకొని నిలబెట్టించిన ఘనత కేసీఆర్‌దని ధ్వజమెత్తారు. అహంకారభావంతో నోటికొచ్చింది మాట్లాడడం సంస్కారం కాదని, తోటివారిని గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను కాపీ కొట్టాల్సిన దౌర్భాగ్యం తమకు లేదన్నారు. దేశానికి స్వాతంత్య్రం కాంగ్రెస్‌తోనే, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్‌తోనే ఏర్పడిందన్న విషయాన్ని 30రోజుల రాజకీయ టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ మరిచారని ఎద్దేవా చేశారు. 129 ఏళ్ల ఘనత ఉన్న కాంగ్రెస్‌ పార్టీ పిల్లకాకిలాంటి కేసీఆర్‌ వద్ద మేనిఫెస్టో కాపీ కొడుతుందనడం అవివేకమన్నారు. కేసీఆర్‌ పచ్చి అవకాశవాది అని, ఓట్ల కోసం ఎంతటికైనా తెగిస్తాడని విమర్శించారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడైనా ప్రజా సంక్షేమం కోసం ఓ పథకం గురించి మాట్లాడారా అని నిలదీశారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదని, రాబోయే రోజుల్లో బంగారు తెలంగాణ పునర్నిర్మాణం కూడా కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో ఐటీిఐఆర్‌ను 50 ఎకరాల్లో ఏర్పాటు చేసి 70 లక్షల ఐటీ ఉద్యోగాలు ఇప్పించే ప్రాజెక్టును కాంగ్రెస్‌ తీసుకొచ్చిందని చెప్పారు. ఏనాడైనా పేద ప్రజలు, రైతుల గురించి మాట్లాడని కేసీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకే నీతులు చెప్పడం శోచనీయమన్నారు. 2004 కాంగ్రెస్‌, 2009లో మహాకూటమితో పొత్తు పెట్టుకొని బీజేపీ పార్టీకి జై కొట్టిన పచ్చి అవకాశవాది కేసీఆర్‌ అని గుర్తుచేశారు. తెలంగాణలో అత్యధిక సీట్లు గెలుపొంది కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒకటి, రెండు సామాజిక వర్గాలకు మినహా అందరికి సీట్ల కేటాయింపులో న్యాయం చేశామని, ప్రభుత్వం ఏర్పడగానే జనాభా ప్రాతిపదికన నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ డి.శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్‌, కరీంనగర్‌ కాంగ్రెస్‌ అసెంబ్లీ అభ్యర్థి చలిమెడ లక్ష్మీనరసింహారావు, మాజీ ఎమ్మెల్యేలు కె.సత్యనారాయణగౌడ్‌, శ్రీరాం భద్రయ్య, కటారి దేవేందర్‌రావు, నాయకులు ప్యాట రమేష్‌, డి.శంకర్‌, సునీల్‌రావు, ఆవాల సరోజ, గందె మాధవి, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు