విమానం.. అంతే సంగతులు
బ్లాక్‌బాక్స్ బ్యాటరీ డిశ్చార్జి అయింది
చేతులెత్తేసిన గాలింపు దేశాలు
కౌలాలంపూర్, ఏప్రిల్ 13 (జనంసాక్షి) :
ఐదు వారాల క్రితం అదృ శ్యమైన మలేషియన్ ఎయి ర్‌లైన్స్
విమాన ప్రమాదం గుట్టువీడే అవకాశాలు దాదాపుగా సన్నగిల్లాయి. విమానం బ్లాక్‌బాక్స్ బ్యాటరీ డిశ్చార్జి అయినట్లుగా దానికోసం గాలింపు జరుపుతున్న దేశాలు వెల్లడించాయి. మలేషియా విమానం బ్లాక్‌బాక్స్ నుంచి గతవారం నాలుగు మార్లు సిగ్నల్స్ అందాయని, ఆ తర్వాత ఎలాంటి సంకేతాలు లేవని దర్యాప్తు జరుగుతున్న దేశాలు వెల్లడించాయి. ఆదివారం దక్షిణ హిందూ మహాసముద్రంలో శకలాల కోసం వేట కొనసాగింది. బ్లాక్‌బాక్స్ బ్యాటరీల చార్జింగ్ ఇక అయిపోయినట్లేనని, ఇక సిగ్నల్స్ వచ్చే అవకాశాలు లేవని అధికారులు నిర్దారణకు వచ్చారు. అయితే ఇంతవరకు అందిన సిగ్నల్స్ ఆధారంగా ఆ స్థానానికి సబ్ మర్సిబుల్ రోబోట్ పంపి అన్వేషణ సాగించనున్నారు. అయితే విమానం గల్లంతు కావడానికి ముందు ఆ విమానం నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయన్న వాదనలను మలేషియా ప్రభుత్వం కొట్టిపారేసింది. కో పైలెట్ ఫోన్ చేశాడని, ఆ కాల్ అర్ధాంతరంగా ముగిసిందని పేర్కొంటూ శనివారం మలేషియా ప్రతికలో ప్రచురితమైన కథనాన్ని నిరాధరమైనదిగా కొట్టి పారేసింది. విమానం కాక్‌పీట్ నుంచి ఫోన్లు వచ్చినట్లుగా తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని మలేషియా రవాణా శాఖ మంత్రి హిషముద్దీన్ హుస్సేన్ ఆదివారం విలేకరులకు వెల్లడించారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి 139 మందితో చైనా రాజధాని బీజింగ్‌కు బయల్దేరిన మలేషియన్ ఎయిర్‌లైన్స్ విమానం అదృశ్యమైన విషయం తెలిసింది. ఆ విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలిపోయినట్లుగా మలేషియా ప్రభుత్వం వెల్లడించింది. ప్రయాణికులంతా మరణించినట్లుగా ప్రకటించింది. బ్లాక్‌బాక్స్ గడువు ఇప్పటికే తీరిపోయిందని, ఇక సంకేతాలు వెలువడే అవకాశాలు లేవని ఆస్ట్రేలియా ప్రధాని అబ్బోట్ ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాక్‌బాక్స్‌ను వెలికి తీసేందుకు సముద్రంలో అన్వేషించే సామర్థ్యమున్న ద్రోన్‌ను పంపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.