కేసీఆర్‌ మోసగాడు


మాటపై నిలబడడు శ్రీపునర్నిర్మాణం బాధ్యత మాదే
తెలంగాణ ఇచ్చింది మేమే శ్రీమీట్‌ ది ప్రెస్‌లో పొన్నాల
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (జనంసాక్షి) :
కొత్తగా ఏర్పడబోయే తెలంగాణలో కాంగ్రెస్‌ తోనే బంగారు తెలంగాణ సాధ్యమని టీ పీసీ సీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశా రు. తెలంగాణ తెచ్చిన పార్టీగా తాము గత పదేళ్లలో అమలు చేసిన కార్యక్రమాలను మ రింత పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను
వేగంగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తమాన్నారు. అమరుల త్యాగంతో ఏర్పడ్డ తెలంగాణలో వారికి సముచిత గౌరవాన్ని అందిస్తామన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో టీయూడబ్ల్యూజే ఏర్పాటు చేసిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో పొన్నాల మాట్లాడారు. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. సోనియాగాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ బిల్లును పాస్‌ చేయించారని తెలిపారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఏర్పడుతుందనే విశ్వాసం తమకు ఉందన్నారు. జయశంకర్‌ పేరుతో ట్రస్ట్‌ ఏర్పాటు చేసి అమరుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. అమరుల కుటుంబాల కోసం హైదరాబాద్‌లో స్మృతివనం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించింది కాంగ్రెస్సేనని గుర్తు చేశారు. కేసీఆర్‌ కంటే ముందు నుంచే కాంగ్రెస్‌ నేతలు తెలంగాణ కోసం పోరాడుతున్నారని మంత్రి పదవి రాలేదనే కేసీఆర్‌ పార్టీ స్థాపించారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌పై ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌లా తాను మాట తప్పలేదని ఆయనలా దౌర్బాగ్యపు మనిషిలా ఉండొద్దనుకుంటున్నానని ఆయన సోమవారమిక్కడ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ పిరికిపందా, వంచకుడు అంటూ ధ్వజమెత్తారు. సకల జనుల సమ్మె సమయంలో కేసీఆర్‌ ఎక్కడున్నారని పొన్నాల ప్రశ్నించారు. తెలంగాణ కోసం కేసీఆర్‌ పార్లమెంట్లో ఎప్పుడైనా మాట్లాడారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిలో సామాజిక న్యాయం పాటిస్తామని పొన్నాల స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ది నిరంకుశ ఎజెండా అంటూ ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకుని బంగారు తెలంగాణను నిర్మించడానికి కృషి చేస్తామని తెలిపారు. అమరుల త్యాగాలపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, వారి త్యాగాలను గుర్తుంచుకుంటుందని పొన్నాల అన్నారు. తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని పొన్నాల లక్ష్మయ్య పదేపదే అన్నారు. కొత్త రాష్ట్రంలో ఏర్పడే తొలి ప్రభుత్వం కూడా తమదేనని ధీమా వ్యక్తం చేశారు. నాడు దేశానికి స్వాతంత్యం తెచ్చింది నేడు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసేనన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి సభ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తామని వెల్లడించారు. తెరాస మేనిఫెస్టోను కాంగ్రెస్‌ కాపీ కొట్టిందని కేసీఆర్‌ విమర్శించడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. హైదరాబాద్‌లో ఐటీఐఆర్‌ ప్రతిపాదనను తాము తీసుకుని వస్తే దానిని కూడా కెసిఆర్‌ తనదిగా ప్రచారం చేసుకోవడం దౌర్భాగ్యమన్నారు. తెరాస రాజకీయ పార్టీగా ఆవిర్భవించి నెల రోజులు కూడా కాలేదని… తమది 125 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ అని వ్యాఖ్యానించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగల సత్తా కాంగ్రెస్‌కు మాత్రమే ఉందన్నారు. టిడిపి హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు సాగునీరు, రహదారులు, మౌలిక వసతులపై నోరు తెరవని కేసీఆర్‌ ఇప్పుడు గొంతుచించుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల ఖర్చు విషయంలో కేసీఆర్‌కు ఇబ్బంది లేదని ఆయన ఒక్క టమాటా చెట్టుకు 300 కాయలు కాయిస్తారని… ఎకరాకు రూ.కోటి ఆదాయం తెస్తారంటూ ఎద్దేవా చేశారు. సకల జనుల సమ్మె కాలంలో కేసీఆర్‌ ఎక్కడ ఉన్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. తెలంగాణ ఉద్యమానికి అడ్డుపడిన 19 మందిని అరువు తెచ్చుకొని టికెట్లు ఇచ్చారంటూ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కాలేననే నిరాశ, నిస్పృహతో ఏం మాట్లాడుతున్నాడో కేసీఆర్‌కు తెలియడం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గోదావరి జలాల సాధనకు ఉద్యమించామని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులు నిర్మించామని వరద కాలువతో ఎల్‌ఎండీని నింపామని వెల్లడించారు. భూపాలపల్లిలో 1900 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. పార్టీలో టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉండడంతో కొన్ని సామాజిక వర్గాలకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించిన టీపీసీసీ అధ్యక్షుడు పార్టీ అధికారంలోకి వచ్చాక అలాంటి వారికి తగిన ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. అంతకుముందు గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ జయంతి వేడుకల్లో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పాల్గొన్నారు. అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పొన్నాల మాట్లాడుతూ కేసీఆర్‌ లాంటి నిరంకుశ పాలకుడిని కాదన్నారు. తాను భూస్వామి, దొరను కాదని, గడీల పాలనను తాను స్వయంగా చూశానని వెల్లడించారు. కేసీఆర్‌ మోసగాడు, ఆయన లాంటి దౌర్భాగ్యమైన బతుకు నాకు వద్దంటూ ఘాటుగా విమర్శించారు.