రెండు ఓట్లు మాకే వేయండి
అభివృద్ధి కోసం ఇంకొకర్ని యాచించొద్దు
తెలంగాణ ముమ్మాటికీ విధ్వంసమయ్యింది పునర్నిర్మాణం జరగాల్సిందే : కేసీఆర్
నిజామాబాద్, ఏప్రిల్ 15 (జనంసాక్షి) :ఎంపీ, ఎమ్మెల్యే రెండు ఓట్లు టీఆర్‌ఎస్‌కే వేయాలని కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నంబర్ టూగా ఉన్న కాంగ్రెస్ నేతలకు తెలంగాణ ప్రజల సమ స్యలను పరిష్కరించే దమ్ము లేదని కేసీఆర్ దుయ్యబట్టారు. వారికి నంబర్ 2గా ఉండే అలవాట య్యిందని, వారు ఎన్నటికీ నంబర్ వన్‌గా కాలేరని అన్నారు. విధ్వంసం జరిగిందని తాను అంటే ఎక్కడ జరిగిందని పొన్నాల అంటున్నాడని, విధ్వంసం జరిగిందా లేదా అన్నది బహిరంగ చర్చకు రావాలని పొన్నాలకు సవాల్ విసిరారు. ఆంధ్రా ప్రాజెక్టులకు వత్తాసు పలికిన నేత పొన్నాల, డికె అరుణ అని అన్నారు. నిధులు రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా ఎమ్మెల్యే, ఎంపీలను గెలిపిం చాలన్నారు. టిఆర్‌ఎస్ గెలిపిస్తే అందరి సమస్యలు పరిష్కరించగలమన్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టాలంటే మన ఎంపీలు ఢిల్లీలో ఉండాలన్నారు. అందుకే అసెంబ్లీ,ఎంపీలు టిఆర్ ఎస్ అభ్యర్థులే గెలవాలన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే టీఆర్‌ఎస్ గెలవాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందూరులో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఆంధ్రా పాలకుల పుణ్యంతో నిజామాబాద్ జిల్లా సర్వనాశనమైందన్నా రు. ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా వ్యవసాయపరంగా ధనవంతమైంది. చెరుకు, వరి, పసుపు పంటలకు పెట్టింది పేరు. ఆంధ్రా పాలకుల చేతిలో అన్ని నాశనమైపోయాయి. సీమాంధ్రుల పు ణ్యంతో ఎంతో వెనుకబడింది. నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ గ్రామం దేశానికే గర్వకా రణమన్నారు. అవన్నీ మళ్లీ సాకారం కావాలన్నారు. ఇక రైతులకు లక్ష రూపాయల రుణమాఫీని పునరుద్ఘాటించారు. అంతేగాకుండా రైతుల ట్రాక్టర్లకు, ట్రాలీలకు జూన్ 2 తర్వాత ట్యాక్స్ ఉండదన్నారు. రైతులకు రూ. లక్ష లోపు రుణమాఫీతో పాటు ఇది అదనమన్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు అని తెలిపారు. సింగూరు ప్రాజెక్టును నిజామాబాద్‌కు అంకితం చేస్తాం. సింగూరు ప్రాజెక్టును పునరుద్దరిస్తాం. హైదరాబాద్‌కు పూర్తిస్థాయిలో కృష్ణా జలాలు తరలించాక దీనిని సాకారం చేస్తామన్నారు. అసలు ఇక్కడి నుంచే నీళ్ల మంత్రి ఉన్నా ఎందుకు ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. ప్రతి జిల్లాకో కాల్వ పెండింగ్‌లో ఉన్నాయి? లెండి కాల్వలు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి? ఎస్‌ఎల్‌బీసీ, నెట్టెంపాడు, భీమతో పాటు అన్ని ప్రాజెక్టులో పెండింగ్‌లో ఉన్నాయి? వీటిపై మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి సమాధానమేంటి? కౌలాస్ నాలా పెద్దది చేసుకుంటే మరో 10 ఎకరాలు పారుతది. వేంపల్లి మత్తడి సరి చేసుకుంటే మరో 5-10 ఎకరాలు పారుతదన్నారు. అయితే టిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ది సాధ్యమన్నారు. సింగూరు ప్రాజెక్టు నిజామాబాద్‌కు అంకితం కావాలని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో ఏ జిల్లాకు వెళ్లినా ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. లెండి ప్రాజెక్టును మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, కొత్త ప్రాజెక్టులు రావాలంటే తెరాస గెలవాలని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్‌లో పసుపు పరిశోధనాకేంద్రం ఏర్పాటుచేస్తామని కేసీఆర్ హావిూ ఇచ్చారు. తెలంగాణ యూనివర్శిటీ అని పేరుకే పెట్టారని, అక్కడ వసతులు లేవని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణ వర్శిటీని అద్భుతంగా అభివృద్ది చేస్తామన్నారు. ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే 17 ఎంపీ స్థానాల్లో తెరాస గెలవాలని కేసీఆర్ అన్నారు. తాను చేపట్టే పథకాలు అమలు కావాలంటే టిఆర్‌ఎస్‌కు అధికరాం కట్టబెట్టాలన్నారు. యుద్దం చేసే వారికి కత్తి చేతిలో పెట్టాలన్నారు. ఇక ఉద్యోగుల ఆప్షన్లు ఉండొద్దన్న విషయంలో కాంగ్రెస్ తన వైఖరిని ప్రకటించాలన్నారు. ఉద్యోగలు ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలన్న దానిపై ఎందుకు నోరు చించుకుంటున్నారని ప్రశ్నించారు. అంగన్ వాడీ, ఆశా వర్కలర్లు, ఐకెపి జీతాలను పెంచుతామన్నారు. వారిని పద్దతి ప్రాకరం వినియోగించుకుని ప్రణాళిక ప్రకారం ముందుకు వెళతామన్నారు. ఇక తెలంగాణాలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండరు. రెగ్యులరైజ్ చేస్తాం. తెలంగాణ అభివృద్ది చెందాలంటే టిఆర్‌ఎస్ రావాలి. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, లంబాడీ తండాలన్నీ పంచాయితీలు చేస్తాం అని అన్నారు. తమది సెక్యులర్ పార్టీ అని అన్నారు. ఎట్టి పరిస్తితుల్లో బిజెపితో కలవమన్నారు. కేసీఆర్ మరోమారు పొన్నాలపై ఫైర్ అయ్యారు. తెలంగాణలోని ప్రాజెక్టులు పూర్తిచేయకుండా అక్రమ ప్రాజెక్టులకు అనుమతులిచ్చి నీళ్లు తరలించింది పొన్నాల కాదా అని ప్రశ్నించారు. పొన్నాల కారణంగానే తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగిందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులంటే శ్రమదోపిడే. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యూలరైజ్ చేస్తం. వికలాంగులకు, వృద్ధులకు వెయ్యి రూపాలయ పెన్షన్ కావాలన్నా టీఆర్‌ఎస్ అధికారంలోకి రావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఇక టిక్కెట్లు దక్కని నేతలకు ఎమ్మెల్సీలు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు పోచారం శ్రీనివాసరెడ్డి, గణెళిశ్ గుప్తా, గంపా గోవర్ధన్, జీవన్ రెడ్డి, కవిత తదితరుల పాల్గొన్నారు.