మేమనుకున్న తెలంగాణ రాలేదు అందుకే విలీనం కాలేదు : కేసీఆర్‌


మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 16 (జనంసాక్షి) :తాము కోరుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదు కాబట్టే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయలేదని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పటు కాకుండా వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నారని కేసీఆర్‌ ఆరోపించారు. 60 ఏళ్లు గోసపడ్డ తరవాత ఏర్పడ్డ తెలంగాణపై ఆంధ్రోళ్ల పెత్తనం కొనసాగితే మన ఉద్యోగాలు, నీల్లు మ లుపుకుని పోతారని హెచ్చరించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్ప డితేనే మనం కన్న కలలు సాధ్యమవుతాయన్నారు. పాలమూరు జిల్లా వనసర్తి ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌, టీడీపీల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత
కూడా చంద్రబాబు ఇంకా ఇక్కడే ఉంటానని అంటున్నారని అన్నారు. ఇక్కడ ఎలాగైన ఖర్చు పెట్టి టీఆర్‌ఎస్‌కు అధికారం దక్కకుండా చేయడమే ఈ ఇద్దరి నాయుడుల కుట్ర అని అన్నారు. రాజకీయ అవినీతిని వంద శాతం బొందపెట్టాలని అన్నారు. దానిని ఎట్టి పరిస్తఙతుల్లోనూ సహించేది లేదన్నారు. అవినీతి కారణంగా అధికారులు, మంత్రులు జైళ్లకు వెళ్లారని అన్నారు. అవినీతి కారణంగా రాష్ట్రం పరువు పోయిందని, అంతర్జాతీయంగా బజారు పాలయ్యమాన్నారు. ఇలాంటి వారిని పాతరేయాలన్నారు. ఎన్నో సుధీర్ఘ పోరాటల తర్వాత తెలంగాణను సాధించుకున్నామని చంద్రశేఖర్‌రావు అన్నారు. అయినా మనం కోరుకున్న తెలంగాణ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి మనపై దయలేదని ఆంక్షలతో కూడిన తెలంగాణ ఇచ్చారని విమర్శించారు. ఇప్పటికైనా సరే మనం కోరుకున్న తెలంగాణ సిద్ధించాలంటే ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తేనే సంపూర్ణ తెలంగాణ సాధ్యమని స్పష్టం చేశారు. సీమాంధ్రుల ఒత్తిళ్లకు తలొగ్గే ఆంక్షలతో కూడిన తెలంగాణ ఇచ్చారని కేసీఆర్‌ మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌ జిల్లాను మూడు జిల్లాలుగా విభజిస్తానని, కాంగ్రెస్‌కు ఓటేసి ప్రజలు మోసపోవద్దని తెరాస అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు. పాలమూరు పచ్చబడాలి, వలసలు పోవాలన్నారు. 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ అవినీతి అంతమైతేనే అభివృద్ధి సాధ్యమని, తన కుటుంబసభ్యులు అవినీతికి పాల్పడ్డా జైలుకు పంపిస్తానని కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒప్పంద ఉద్యోగులు ఉండరన్నారు. రాష్టాన్న్రి సింగపూర్‌, జపాన్‌ చేస్తామనేవాళ్ల మాట నమ్మొద్దన్నారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో తెరాస విజయం సాధించాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. ఇంటి పార్టీ గెలిస్తేనే ఢిల్లీలో పోరాటం చేయొచ్చన్నారు. 60 ఏళ్లు గోసపడ్డాం. మళ్లీ మోసపోవద్దు. తెలంగాణ ఉద్యమం నడిచిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. అన్నింట్లో తెలంగాణకు న్యాయం జరగాలి. తెలంగాణలో సకల సమస్యలకు కారణం కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలేనన్నారు. మా పార్టీ మేనిఫెస్టోను చూసి కేసీఆర్‌ అరచేతిలో వైంకుఠాన్ని చూపిస్తున్నారని పొన్నాల అన్నారు. ఆయనకు అంతకన్నా ఎక్కువ చాతకాదన్నారు. పాలమూరులో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాల్సి ఉందన్నారు. వీటన్నిటిని సాధించాలంటే తెలంగాణ ఇంటి పార్టీ టిఆర్‌ఎస్‌కు అధికారం రావాలన్నారు. రఘువీరా రెడ్డి పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లను మళ్లించే ప్రయత్నానికి పొన్నాల జెండా ఊపితే, డీకే అరుణ హారతి పట్టిందన్నారు. ఎన్నికల సమయంలో ఆగం కాకుండా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. వేదికపై నాగర్‌ కర్నూలు ఎంపీ అభ్యర్థి మందా జగన్నాథం, వనపర్తి అసెంబ్లీ అభ్యర్థి నిరంజన్‌ రెడ్డి, గద్వాల అభ్థర్థి కృష్ణమోహన్‌ రెడ్డి, జూపల్లి, జైపాల్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.