మావోయిస్టుల సంగతి మాకు వ‌దిలేయండి

ధైర్యంగా ఓటు హక్కు వినియోగింకోండి … డిజిపి ప్రసాదరావు

హైదరాబాద్: అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 30, మే ఏడవ తేదీన లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడడానికి, మావోయిస్టులను అడ్డుకోవడానికి చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల వెంబడి భద్రతా ఏర్పాట్లను పెంచినట్లు ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరక్టర్ జనరల్ బి.ప్రసాదరావు ఆదివారం తెలిపారు. “చత్తీస్‌గఢ్, ఒడిశా లాంటి పొరుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు చురుగ్గా ఉన్నాయి. అలాగే మహారాష్ట్రలో కొంతవరకు మావోయిస్టులు చురుగ్గా ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మావోయిస్టులను అడ్డుకోవడానికి, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో అన్ని చర్యలు తీసుకున్నాం” అని డిజిపి వివరించారు.”ఎన్నికలు నిర్వహిస్తున్న ప్రతిసారీ వారు(మావోయిస్టులు) ఎన్నికల బహిష్కరణకు పిలుపునిస్తారు. మేం భద్రతా ఏర్పాట్లు (ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగించడంలో మావోయిస్టుల ప్రయత్నాలను అడ్డుకోవడానికి) చేస్తున్నాం” అని ఆయన విలేకరులతో అన్నారు. కాగా ఇక్కడ పీపుల్స్ ప్లాజా వద్ద ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరమ్(ఏపీజెఎఫ్) నిర్వహించి మరో కార్యక్రమంలో మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా ప్రజలకు డిజిపి విజ్ఞప్తి చేశారు.