మద్యం సిండికేట్లపై గవర్నర్‌ కొరడా

34 మంది అధికారుల ప్రాసిక్యూషన్‌కు అనుమతి
అక్రమార్కుల గుండెల్లో రైళ్లు
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (జనంసాక్షి) :
మద్యం సిండికేట్లపై రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ కొరడా ఝలిపించారు. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఈ కేసు గవర్నర్‌ నిర్ణయంతో క్కసారిగా మలుపు తిరిగింది. దీనిపై గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. సిండికేట్లతో సంబంధం ఉన్న 34 మంది అధికారులపై ప్రాసిక్యూషన్‌కు అనుమతినిచ్చారు. వారం రోజుల క్రితం అనుమతి ఇచ్చినప్పటికీ, ఈ మేరకు గవర్నర్‌ కార్యాలయం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మద్యం సిండికేట్లపై ఆగ్రహంతో ఉన్న గవర్నర్‌ ఈ వ్యవహారంపై సీరియస్‌గానే స్పందించారు. తొలి విడతగా 34 మంది అధికారులపై ప్రాసిక్యూషన్‌కు అనుమతిచ్చినా అభియోగాలు ఎదుర్కొంటున్న వారందరిపైనా ప్రాసిక్యూషన్‌కు అనుమతించే అవకాశముందని తెలుస్తోంది. మద్యం వ్యాపారులు సిండికేట్లుగా మారి ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులకు ముడుపులు చెల్లించి, అధిక ధరలకు అమ్ముకోవడం వెలుగు చూసింది. సిండికేట్ల వ్యవహారం వెలుగు చూడడంతో ఏసీబీ ఒక్కసారిగా దాడులు నిర్వహించి మద్యం వ్యాపారుల్లో గుబులు పుట్టించింది. డిసెంబర్‌ 16, 2011న రాష్ట్రవ్యాప్తంగా మద్యం సిండికేట్లపై ఏసీబీ దాడులు మొదలు పెట్టింది. సిండికేట్‌ కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. ఖమ్మం జిల్లాకు చెందిన సిండికేట్‌ లీడర్‌ నున్నా రమణను ఫిబ్రవరి 7, 2012న అరెస్టు చేయడంతో మద్యం సిండికేట్ల బాగోతం బట్టబయలైంది. ఆయన ఇచ్చిన సమాచారంతో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం వ్యాపారులపై దాడులు ముమ్మరమయ్యాయి. పలువురిని అరెస్టు చేసి, కీలక రికార్డులను సీజ్‌ చేసింది. అలాగే తన అనుమతి లేకుండా సిండికేట్‌ వ్యాపారులకు మద్యం సరఫరా చేయరాదని ఆదేశించింది. మరోవైపు, సిండికేట్‌ వ్యాపారం నిర్వహించుకునేందుకు అప్పటి ఎక్సైజ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణకు రూ.10 లక్షలు ఇచ్చినట్లు నున్నా రమణ విచారణలో వెల్లడించడం సంచలనం సృష్టించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేగింది. మరోవైపు సిండికేట్‌ల కేసులో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌)ను ఏర్పాటు చేసింది. దీనికి శ్రీనివాసరెడ్డిని ఇన్‌చార్జిగా నియమించింది. ఆయన మద్యం వ్యాపారులపై కఠినంగా వ్యవహరించడం మొదలుపెట్టడంతో సిండికేట్‌ వ్యాపారుల్లో దడ మొదలైంది. కొంత మంది రాజకీయ నేతలు బినావిూ పేర్లతో, తెల్ల రేషన్‌కార్డుదారుల పేర్లతో మద్యం షాపులు చేజిక్కించుకున్నారని ఏసీబీ నిగ్గుతేల్చింది. మద్యం దుకాణాలు పొందిన వారంతా తెల్లకార్డుదారులని, వారంతా కూలీలు, పేదలు ఉన్నారని, కొందరు నేతలే వారి పేరిట షాపులను దక్కించుకని దండుకుంటున్న వైనాన్ని బట్టబయలు చేసింది. అయితే, మద్యం సిండికేట్లలో చాలా మంది రాజకీయ నాయకులకు ప్రత్యక్షంగా సంబంధాలు ఉండడం ఏకంగా నాటి పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ హస్తం వెలుగుచూడడం వారంతా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో నిజాయతీగా పని చేసిన శ్రీనివాసరెడ్డిని సర్కారు బదిలీ చేసింది. ఆయన బదిలీపై గుర్రుగా ఉన్న ఏసీబీ ఏడీజీ భూపతిబాబు సిండికేట్ల వ్యవహారంపై కఠినంగా వ్యవహరించారు. దీంతో ఆయనకు చెక్‌ పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆయనపై ఉన్నతాధికారిని నియమించింది. ఇది నచ్చని ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం కొద్దిరోజులుగా ఏసీబీ దాడులు నిలిచిపోయాయి. అయితే, మద్యం సిండికేట్ల దర్యాప్తు అటకెక్కినట్లేనని అంతా భావించారు. ఈ నేపథ్యంలో మద్యం సిండికేట్ల వ్యవహారంలో దర్యాప్తు హైకోర్టు పర్యవేక్షణలో జరిగేలా చూడాలని పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో హైకోర్టు జోక్యం చేసుకుంది. తన పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని ఆదేశించింది. దీంతో విచారణ పూర్తి చేసిన ఏసీబీ కోర్టుకు నివేదిక సమర్పించింది. మొత్తం 180 మందిపై ప్రాసిక్యూషన్‌ అవసరమని తేల్చింది. అయితే, వారి ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతివ్వకుండా ఏడాదికి పైగా పెండింగ్‌లో ఉంచింది. కాగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టడంతో పాలన వ్యవహారమంతా గవర్నర్‌ చేతుల్లోకి వచ్చింది. ఇదే సమయంలో మద్యం సిండికేట్ల వ్యవహారాన్ని ఏసీబీ గవర్నర్‌ దృష్టికి తీసుకువచ్చింది. పెండింగ్‌ ఫైల్‌ దుమ్ముదులిపిన నరసింహన్‌ తొలి విడతలో 34 మంది అధికారుల ప్రాసిక్యూషన్‌కు అనుమతినిచ్చారు. మిగతా వారిపైనా త్వరలోనే నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని సమాచారం.